బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తామన్న తృణమూల్ ఎమ్మెల్యేపై వేటు
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీఎమ్‌సీ నేత, కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ తెలిపారు.ఇంటర్నెట్ డెస్క్: బెంగాల్‌లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదానికి తెరతీసిన తృణమూల్ నేత, భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఎమ్‌సీ ప్రకటించింది. బీజేపీ మద్దతుతో ఆయన మతసామరస్యం దెబ్బతినే వ్యాఖ్యలు చేశారని టీఎమ్‌సీ నేత, కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ మండిపడ్డాడు. గతంలోనే పార్టీ ఆయనను పలుమార్లు హెచ్చరించిందని గుర్తు చేశారు (TMC MLA Humanyun Kabir Suspended).‘ఇప్పటికే ఆయనకు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాము. కానీ ఆయన పద్ధతి మార్చుకోలేదు. అందుకే సస్పెండ్ చేశాము. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’ అని ఫర్హాద్ హకీమ్ తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ శైలి గతంలో కూడా వివాదాలకు దారి తీసింది. పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన తీరు కాంట్రవర్సిటీకి కారణమైంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ బెల్దంగాలో డిసెంబర్ 6న బాబ్రీ మసీదుకు పునాది రాయి వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ కావడంపై కూడా కబీర్ స్పందించారు. త్వరలో టీఎమ్‌సీ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతానని చెప్పుకొచ్చారు.
