బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని లక్నేపెల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ్ దివస్ ను ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాల స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ మే, 1999 న పాకిస్తాన్ చొరబాటుదారులు దొంగ చాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగాన్ని ఆక్రమించారని అలాగే శ్రీనగర్, లేహ్ ను కలిపే కీలకమైన జాతీయ రహదారి 1-ఏ ను విడదీయడం వారి దుష్ట లక్ష్యంగాచేసుకొని భారత సైన్యంపై దాడి జరిపారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే భారత సైన్యం కళ్ళలో జాతీయ జెండాను,గుండెల్లో దేశభక్తిని కలిగి శత్రుతూటాలకు ఎదురొడ్డి తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో గెలిచిన రోజు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేశ్, రామ్మూర్తి ,విజయ్, గౌతమ్, కనకయ్య , రామ్ కిషోర్, ఓదేలు, కనకరాజు, అనిత,వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చందు, పార్వతి, ఎన్.సి.సి క్యాడేట్లు , విద్యార్థులు పాల్గొన్నారు.