ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

 

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

చెన్నై: ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచే పెనుగాలులతో నగరం, శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. వేకువజామున కాసేపు విరామం తర్వాత ఉదయం 7 గంటల నుంచి వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
చేపాక్‌, ట్రిప్లికేన్‌ రాయపేట, మైలాపూరు, పట్టినంబాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, వాషర్‌మెన్‌పేట, టి.నగర్‌, కోడంబాక్కం, కీల్పాక్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతున వర్షపునీరు ప్రవహించింది. దీంతో వాహన చోదకులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాఫ్‌డే సెలవు ప్రకటించాయి. ఇక నగర శివారుప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్‌, సెంట్రల్‌ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్‌ తాంగళ్‌, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్‌ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్‌ జంక్షన్‌, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అండమాన్‌ విమానాల రద్దు…

నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్‌ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.

 

హైదరాబాద్‌లో మూడు రోడ్లు – ముప్పుతిప్పలు..

హైదరాబాద్‌లో మూడు రోడ్లు – ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!

 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.

 నగరంలో ఐటీ ఉద్యోగుల విలువైన సమయం రోడ్ల పాలవుతోంది. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఏ మార్గంలో వెళ్లాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లోనే వాహనాలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. రహదారుల విస్తరణ జరగకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలుగా అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటోంది.కారిడార్ మీదుగా వెళ్లే మూడు ప్రధాన రహదారులే వీరికి ఆధారం. గచ్చిబౌలి ఔటర్‌రింగు రోడ్డు చౌరస్తా నుంచి కొండాపూర్, కొత్తగూడ మీదుగా హఫీజ్‌పేట వరకు ఉన్న పాత ముంబయి హైవే, రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, శిల్పారామం మీదుగా కేపీహెచ్బీ-జేఎన్టీయూ వరకు, కొత్తగూడ-కొండాపూర్ చౌరస్తా నుంచి హైటెక్స్ కూడలి, సైబర్ టవర్స్ మీదుగా మాదాపూర్-జూబ్లీహిల్స్ వరకు ఉన్న ఈ రోడ్ల మీదే వీరు ప్రయాణించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ కారిడార్‌లో రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ నరకం అంటే ఏమిటో కళ్లముందు కనిపిస్తుంది. అడుగులో అడుగు వేసినట్లుగా కదిలే వాహనాలతో గంటల తరబడి రోడ్లమీదే గడపాల్సి వస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version