ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం
రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్, సెంట్రల్ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్ తాంగళ్, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్ జంక్షన్, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అండమాన్ విమానాల రద్దు…
నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.
