*శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం..
*కార్మికుల గృహ నిర్మాణాలు..
*సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ..
తిరుపతి నేటి ధాత్రి
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ కటికితల, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం)ఇషా కాలియా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎన్.మౌర్య, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ తో కలసి బుధవారం శ్రీసిటీని సందర్శించారుశ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి,శ్రీసిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు.
చర్చల సందర్భంగా, శ్రీసిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వసతులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు.
అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్,ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు,ఇతర సుస్థిరత కార్యక్రమాలను వివరించారు. టౌన్‌షిప్ ల అభివృద్ధి ద్వారా “వాక్ టు వర్క్” ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు.
ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు,భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌళిక సదుపాయాలు,నివాస గృహాల డిమాండ్ ముఖ్యంగా డార్మిటరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీసిటీ బృందానికి సూచించారు. అనంతరం, పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన, ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌకధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
కేంద్ర గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌళిక సదుపాయాలుగృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌళిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్‌స్టోమ్ పరిశ్రమలో తయారు అవుతున్న మెట్రో కోచ్ ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌళిక వసతులను పరిశీలించారు. అద్భుత ప్రణాళిక, కార్యాచరణతో రూపుదిద్దుకున్న శ్రీసిటీ పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఇక్కడి ప్రజలు,ఈ ప్రాంతం,దేశ శ్రేయస్సుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. శ్రీసిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూళ్లూరుపేట
ఆర్ డి ఓ,
కిరణ్మయి పాల్గొన్నారు.