ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య.

ఎయిరిండియా విమాన ప్రమాదం పెరిగిన మృతుల సంఖ్య…

Plane Crash Death Toll: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడినవారు సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం Air India flight accident)లో మృతుల సంఖ్య పెరిగింది. మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 279కి చేరింది. గాయపడినవారు (Victims) సివిల్ హాస్పిటల్‌ (Civil Hospital)లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో 241 ప్రయాణికులు, 38 మంది బిజె మెడికల్ కళాశాల ప్రాంగణంలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
డీఎన్ఏ పరీక్షలు..

మరోవైపు సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల అప్పగింత కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఆదివారం విమాన ప్రమాద ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అధికారులు అప్పగిస్తున్నారు. కాగా చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా వారు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం.

ఉన్నతస్థాయి కమిటి…

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version