జహీరాబాద్లో ఏఐఎంఐఎం పార్టీలో భారీ చేరికలు
◆-: 925వ వార్డు యువకులతో బలపడుతున్న మజ్లిస్…
జహీరాబాద్ నేటి ధాత్రి:
మున్సిపాలిటీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉండగా, ఏఐఎంఐఎం పార్టీలో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని 25వ వార్డుకు చెందిన పలువురు యువకులు మజ్లిస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఏఐఎంఐఎం పార్టీలో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గ ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అత్తర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహియోద్దీన్ గౌరి, పట్టణ కార్యదర్శి మొహమ్మద్ అమెర్ల సమక్షంలో 25వ వార్డుకు చెందిన ఎండి. ముజాహెద్, ఎండి. వాజిద్ తదితరులు అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అత్తర్ అహ్మద్ నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు షఫియోద్దీన్, షరీఫ్ తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన అత్తర్ అహ్మద్, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ ఒంటరిగా పోటీ చేసి జహీరాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
