కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో కల్తీ కారతయారీ కేంద్రాలపై పోలీసులు మంగళవారం భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కల్తీ కార తయారీ కేంద్రాలను మూసివేసి, ఇద్దరు యజమానులను రిమాండ్ చేశారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే, పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరుకుతో పిండి
వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రగతి నగర్ కాలనీలోని “పరస్ కార తయారీ కేంద్రం” యజమాని పరాస్ నాథ్, అలాగే హమాలి కాలనీలోని “అభినయ శ్రీ స్పెషల్ కార తయారీ కేంద్రం” యజమాని ఆయెన పేరుమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు, జహీరాబాద్ టౌన్ ఎస్ఐలు కే.వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కే.సంగమేశ్వర్ లు తమ సిబ్బందితో కలిసి ఈ రెండు కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. పరిశీలనలో, ఆ కేంద్రాల్లో అగ్ని భద్రతా నియమాలు, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండానే కొంతమంది పని మనుషులతో కల్తీ పిండి వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ విధంగా తయారు చేసిన పదార్థాలను జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కార తయారీకి వాడిన పదార్థాలు, యంత్రాలు, ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ పేర్కొన్నారు.
