పెన్షన్ల పెంపు కోసం రామడుగు మండలం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు
రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరువేలకు పెంచాలని, వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత, బీడీ కార్మికులతో పాటు మిగితా పెన్షన్ దారుల పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) మరియు చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (సిపిహెచ్పిఎస్) ఆద్వర్యంలో రామడుగు మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నాను చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా విహెచ్పిఎస్ నాయకులు మర్రి కుమార్ చిమ్మల్ల శ్రీనివాస్, జనార్దన్ లు మాట్లాడుతూ పెన్షన్ దారులకు ఇచ్చిన మాటకు కట్టుబడిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రుణమాఫీ, భూస్వాములకు రైతుబంధు ఇచ్చిన రేవంత్ నిస్సహాయ స్థితిలో ఉన్న పెన్షన్ దారుల పెన్షన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. దొరలు, భూస్వాములు, సంపన్నుల పక్షాననే రేవంత్ ఉన్నారు తప్ప పేద వర్గాల పక్షాన లేడు అనేది పెన్షన్ దారుల విషయంలో రుజువైందన్నారు. నాలుగు వేల పెన్షన్లు సరిపోక వికలాంగులు, రెండు వేల పెన్షన్లు సరిపోక వృద్దులు వితంతువులు మరియు ఇతర చేయూత పెన్షన్ దారులు గోస పడుతుంటే రేవంత్ రెడ్డిలో కనీసం చలనం లేదన్నారు . ఏదిక్కు లేని పెన్షన్ దారులకు న్యాయం చేయలేని రేవంత్ రెడ్డికి తెలంగాణను పరిపాలించే అర్హత లేదన్నారు. మాట ఇచ్చి ఇరవై రెండు నెలలు దాటినా ఇంకా నిలబెట్టుకోక పోవడం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి నిదర్శనమని, ఇకనైనా తీరు మార్చుకొని తక్షణమే అన్ని రకాల పెన్షన్లు పెంచాలని, నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ దారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 21 నుండి 26 వరకు అన్ని గ్రామ పంచాయితీల వద్ద దీక్షలు చేపడతామని హెచ్చరించారు. పెన్షన్లు పెంచుడో లేదా రేవంత్ దిగిపోవుడో ఏదో ఒకటి తేల్చుకుంటామని హేచ్చరించారు. ధర్నా అనంతరం తహశీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో బెజ్జంకి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కొత్తూరి రాజన్న మాదిగ, ఎమ్ఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని అంజయ్య, విహెచ్పిఎస్ నాయకులు జట్టిపల్లి రామవ్వ, అమీనా బేగం కవిత జరీనా, శ్రీపాద మహేష్ చారి, జోగిని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.