యూరియా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
రాయపర్తి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన..తనిఖీలు
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘాల, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను మంగళవారం
కలెక్టర్ డాక్టర్ సత్య శారద వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.దుకాణాల్లోని యూరియా, ఇతర ఎరువులు నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా జగేటట్లు చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ చేసిన కలెక్టర్
రాయపర్తి మండల కేంద్రం, పిరికెడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా నిర్వహించారు.ఎంపీడీవో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో నుండి కొందరి లబ్ధిదారుల వద్దకు కలెక్టర్ నేరుగా వెళ్లి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి అద్దె ఇంట్లో ఉంటున్నారా,తదితర అర్హత వివరాలను పరిశీలించారు.
అనంతరం లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్
రాయపర్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోర రక్ష ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలో ఇంటర్మీడియట్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థులచే కలెక్టర్ రక్త పరీక్షలు చేయించారు.రెసిడెన్షియల్ పాఠశాలలో పరిసరాలు, వంట గదులు, నిలువ చేసే ఆహార పదార్థాలు, కూరగాయలు పళ్ళను పరిశీలించారు. తాజా నాణ్యమైన
కూరగాయలు పళ్లు నిత్యము అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని సూచించారు. హాస్టల్ ఆవరణతో పాటు వంట గదులు కచ్చితంగా శుభ్రంగా ఉంచాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతిరోజు అందిస్తున్న భోజనం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.భోజన నాణ్యతను పరిశీలించి,విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, గృహ నిర్మాణాల శాఖ పిడి గణపతి శ్రీనివాస్,ఎంపీడీవో కిషన్,మండల తాసిల్దార్ మండల వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.