భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి కొన్ని రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంత నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలి-గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్పల్లి ఆగస్టు 18 నేటి ధాత్రి
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేకుండా అవసరమైన సహాయక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మరి కొన్ని రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని కోరారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
కాగా రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవేళ ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు.
అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళకూడదని కోరారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు.
అదే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ప్రాజెక్టు నిండి వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి పెట్టారని జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.