పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
భవిష్యత్ తరాల కోసం సహజ వనరుల సంరక్షణపై దృష్టి పెట్టాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నేటిధాత్రి ప్రతినిధి,వరంగల్:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూమి మనకు అందించిన సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా ఉంచవచ్చన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం అత్యంత కీలకమని, సరైన వనరుల వినియోగం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న వారితో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు పిపిటి ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ ధరిత్రి దినోత్సవం పక్షోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) వైవి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం 50 మొక్కలు నాటాలని, ప్రతి సంవత్సరం ఒక మొక్కను పెంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రంగయ్య నాయుడు, అటవీ శాఖ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
