మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్
మహిళల ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.
‘అమన్‌జోత్(Amanjot Kaur) కెరీర్ వెనక మా అమ్మ భగవంతి మూలస్తంభంలా నిలబడింది. మొహాలీలో అమన్ వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెనే తీసుకెళ్లేది. బలోంగిలో నాకు కార్పెంటరీ షాప్ ఉంది. అమన్‌తో వెళ్లేందుకు నాకు వీలయ్యేది కాదు. కానీ ఇంటి ముందు, పార్క్ వద్ద అమన్ మగపిల్లలతో ఆడేటప్పుడు బయట కూర్చొని చూస్తూ ఉండేది. చాలామంది అమ్మాయిలూ ధైర్యంగా వారితో ఆడేవారు. ప్రపంచ కప్ సమయంలో మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అమన్‌కు చెప్పలేదు. ఆమె దృష్టి మారకుండా ఉండాలనే అలా చేశాం’ అని అమన్ తండ్రి భూపిందర్ సింగ్ తెలిపారు.
తన నానమ్మ విషయంలో తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నంగా ప్రచారం అవ్వడంపై అమన్ స్పందించింది. ‘మా నానమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బయట ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వాస్తవాలు నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అమన్ వెల్లడించింది.
