కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డున పడ్డరు

కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డున పడ్డరు

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల,నేటిధాత్రి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో ప్రమాదకరంగా చెలగాటమాడుతోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బుధవారం పరకాల వ్యవసాయ మార్కెట్‌లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల దుస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మార్కెట్‌లో కనీస సదుపాయాల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మక్కల కొనుగోలు కేంద్రంలో కాంటాలు లేకపోవడం,గన్నీ సంచుల కొరత,కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పంటను కల్లాల్లో వేసి రోజుల తరబడి కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోయినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతును రాజుగా గౌరవించారని,ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతు బానిస స్థాయికి దిగజారిపోయాడని విమర్శించారు.

రైతు భరోసా ఎక్కడ రైతు బీమా ఎవరికి అందుతోంది పంట కొనుగోళ్లు ఎందుకు నిలిచిపోయాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వ్యవసాయ రంగంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని,కేవలం ప్రచార రాజకీయాలకు పరిమితమైందని ఆరోపించారు.యూరియా కొరత,సాగునీటి సమస్యలు,విద్యుత్ కోతలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version