విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య…

విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం,షెడ్యూల్డ్ కులముల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాల,వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, విద్యార్థుల గదులు, వంటశాల,భోజనశాల, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు చేపట్టిందని, విద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకోవాలని,ఆ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని,ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం,త్రాగునీరు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని,గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వేసవి అయినందున త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు – ఎంపీ గురుమూర్తి…

*సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు – ఎంపీ గురుమూర్తి…

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి బి.సి. సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రీబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రసంగిస్తూ, మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రీబాయి పూలే గారు సుమారు 200 సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు. మూఢనమ్మకాలతో నిండిన అప్పటి సమాజంలో మహిళలకు చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం, జ్యోతిరావ్ పూలే గారితో కలిసి ముందుకు తీసుకెళ్లిన ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. మహిళల విద్య కోసం ఆమె కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఒక బ్యానర్ కొద్ది మందికే ప్రేరణనిస్తే, ఒక విగ్రహం తరతరాలకు కోట్ల మందికి స్ఫూర్తినిస్తుందని ఎంపీ అన్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన బి.సి. సంఘర్షణ సమితికి, బి.సి. నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
నాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చి, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. పాఠశాలల అభివృద్ధి, ఇంగ్లీష్ మీడియం విద్య, శుభ్రమైన వాతావరణం, తాగునీరు, యూనిఫార్ములు, పుస్తకాలు, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా విద్య నిరాటంకంగా కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమని తెలిపారు. ప్రభుత్వాలు మారినా విద్యపై ఉన్న ఈ స్ఫూర్తి కొనసాగాలని, ప్రతి బిడ్డ మంచి చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అన్ని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version