*సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు – ఎంపీ గురుమూర్తి…

*సావిత్రీబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు – ఎంపీ గురుమూర్తి…

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి బి.సి. సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో సావిత్రీబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రసంగిస్తూ, మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రీబాయి పూలే గారు సుమారు 200 సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు. మూఢనమ్మకాలతో నిండిన అప్పటి సమాజంలో మహిళలకు చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం, జ్యోతిరావ్ పూలే గారితో కలిసి ముందుకు తీసుకెళ్లిన ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. మహిళల విద్య కోసం ఆమె కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
ఒక బ్యానర్ కొద్ది మందికే ప్రేరణనిస్తే, ఒక విగ్రహం తరతరాలకు కోట్ల మందికి స్ఫూర్తినిస్తుందని ఎంపీ అన్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన బి.సి. సంఘర్షణ సమితికి, బి.సి. నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
నాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చి, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. పాఠశాలల అభివృద్ధి, ఇంగ్లీష్ మీడియం విద్య, శుభ్రమైన వాతావరణం, తాగునీరు, యూనిఫార్ములు, పుస్తకాలు, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా విద్య నిరాటంకంగా కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమని తెలిపారు. ప్రభుత్వాలు మారినా విద్యపై ఉన్న ఈ స్ఫూర్తి కొనసాగాలని, ప్రతి బిడ్డ మంచి చదువుతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అన్ని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

తిరుపతి రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డు ఆమోదం…

*రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం..

తిరుపతి(నేటిధాత్రి)నవంబర్

 

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్‌ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపుకు మాత్రమే యాక్సెస్ రోడ్డు ఉండగా ఇందుకు అదనంగా ఎడమ వైపుకు వైపుకు అనగా రేణిగుంట వైపు యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆమోదం లభించింది.
తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్‌కు పాత హీరోహోండా షోరూం వద్ద రైల్వే గేట్ నంబర్‌ 107 వైపు మాత్రమే యాక్సెస్ ఉండటంతో భవిష్యత్తులో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముందుచూపుతో ఎంపీ గురుమూర్తి గుర్తించారు. అందుకే కాటన్ మిల్ గేట్‌ నంబర్‌ 108 వైపుగా కూడా అదనపు యాక్సెస్ రోడ్డు అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీ వాస్తవ కి లేఖ రాశారు.
ఎంపీ ప్రతిపాదనపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన జరిపి యాక్సెస్ రోడ్డు ఏర్పాటు సాధ్యమని తేల్చింది.ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం అందించారు.
ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుండి మంగళం, లీలామహల్ సర్కిల్ వైపుకు వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version