రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్థులను ఆదుకోవాలి
* తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వామిగౌడ్
* జిల్లా గౌడ సంక్షేమం కోసం కృషి చేస్తా
• గౌడ సంఘం రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా జి. వెంకటేష్ గౌడ్ ఎన్నిక
నేటిధాత్రి, చేవెళ్ల :
గౌడ కులస్థులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ స్పీకర్ స్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం గౌడ సంఘం మొయినాబాద్ మండల అధ్యక్షులు అంజయ్య గౌడ్ అధ్యక్షతన కనకమామిడి శివారులో సాయి గార్డెన్లో జరిగిన గౌడ సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్యతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వామిగౌడ్, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి. ఎస్. ఇ. డబ్లు. ఐ. డి. సి ) మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ హాజరయ్యారు. గౌడ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అందువల్ల వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేకంగా 5వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గీత వృత్తికి గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో ఎంఎస్ నంబరు 164ని వెంటనే తొలగించాలన్నారు.
* జిల్లా గౌడ సంఘం అధ్యక్షులుగా జి. వెంకటేష్ గౌడ్.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులుగా జి. వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా జిల్లా నూతన అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థుల సంక్షేమ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గౌడ సంఘం బలోపేతానికి శాయయశక్తుల పనిచేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కుల వృత్తి రక్షణకు గౌడలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లు గీత వృత్తి రక్షణ, రాజ్యాధికారం సాధనకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు అంజయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెనట్ల మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు గట్టు రాంచంద్రయ్య గౌడ్, మాజీ చైర్మన్ పల్లె రవి, డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్, మాజీ ఎంపిపి పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి చంద్రలింగం గౌడ్, మాజీ ఎంపిటిసి మోహన్ గౌడ్, మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ హరి శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడ్, బకారం జాగీర్ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, చందానగర్ సర్పంచ్ మురళి క్రిష్ణ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నర్సిములు గౌడ్, కౌన్సిలర్ అరుణ, సర్పంచ్ పద్మ, సర్పంచ్ పుష్పమ్మ , మాజీ సర్పంచ్ స్వప్న, మాజీ సర్పంచ్ వినీత, గౌడ సంఘం జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
