వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ
నేటిధాత్రి, వరంగల్.
తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.
ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.
