తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version