10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, సెల్ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
