ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం
నడీకూడ,నేటిధాత్రి:
సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను అడవిలో వేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న చైతన్య కార్యక్రమం చేపట్టారు.
నా ప్లాస్టిక్ నా బ్యాగ్‌లోనే
మా చెత్త మా ఇంటికే
అమ్మల ఆశీర్వాదం అడవిని కాపాడితేనే
అనే నినాదాలతో విద్యార్థులు ఓ పాత క్యారీ బ్యాగ్‌తో ప్రజలలో అవగాహన కల్పించారు.మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ వెంట ఒక క్యారీ బ్యాగ్ వెంట తీసుకెళ్లి అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమం ద్వారా భక్తి అంటే దర్శనం మాత్రమే కాకుండా అడవిని, పర్యావరణాన్ని రక్షించడమూ మన కర్తవ్యం అనే సందేశాన్ని విద్యార్థులు బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లారు.
జాతర కొన్ని రోజులు మాత్రమే ఉన్నా,అడవి తరతరాల పాటు నిలవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయత్నం భక్తులలో మార్పు చైతన్యాన్ని కలిగించేలా ఉందని గ్రామస్థులు ప్రశంసించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడితేనే సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం నిలుస్తుందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్పష్టమైన సందేశం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పావని, సత్యపాల్ విద్యార్థులను అభినందించారు.
