కోటగుళ్లలో ఘనంగా శ్రావణ సోమవారం పూజలు
ఆలయంలో భక్తుల కోలాహలం
స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, గణపేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని నాగాభరణం పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలమాలతో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద మహిళలు దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.