ఐనవోలు మండలంలో యూరియా దందా రెచ్చిపోతోంది
లింక్ సేల్స్‌తో రైతులపై వ్యాపారుల పెత్తనం
లింక్ సేల్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
నేటి ధాత్రి అయినవోలు:-
ఐనవోలు మండలంలో యూరియా దందా రోజురోజుకీ భగ్గుమంటోంది. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియాను కృత్రిమ కొరత సృష్టించి, వ్యాపారులు లింక్ సేల్స్ పేరుతో రైతులపై అన్యాయాలు పెంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలంలోని చాలా దుకాణాల్లో యూరియా కావాలంటే మరో వస్తువు కొనాల్సిందేనని డీలర్లు తెగబడుతున్నారు. “స్టాక్ లేదు”, “రేపు రండి” అనే నాటకం, గోదాముల వెనకాల దాచిన సంచులు, నల్లబజారు ధరలకు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న సేల్స్… ఇవన్నీ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.రైతులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూల్లో నిలబడ్డా, చివరకు నిరాశతో వెళ్లాల్సిన పరిస్థితి. పంట దశ కీలకంగా ఉన్న ఈ సమయంలో యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యాపారుల దందా పెరుగుతున్నా, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం రైతులలో మరింత ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కొరతగా చూపించి నల్లబజారులో అమ్మడం స్పష్టమైన దందా. వెంటనే తనిఖీలు జరగాలి. దందా ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం” అని రైతులు హెచ్చరిస్తున్నారు.
