అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.అయితే ఇదే అంశం భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
