`అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు సంచలనతీర్పు
`ఒళ్లు దగ్గరపెట్టుకోకపోతే అధికార్లకూ తప్పదు జరిమానా!
`కంప్లీషన్ సర్టిఫికెట్ జారీలో అధికార్లకు మరింత జవాబుదారీతనం తప్పదు
`కంప్లీషన్ సర్టిఫికెట్ వుంటేనే బ్యాంకుల రుణాలు
`విద్యుత్, తాగునీరు, మురుగునీటి సౌకర్యాలు కూడా ఈ సర్టిఫికెట్ ఆధారంగానే
`నిర్మాణ ప్రదేశంలో బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శన తప్పనిసరి
`కొనుగోలుదారులూ జాగ్రత్తపడకపోతే నష్టపోక తప్పదు
`అనవసర సానుభూతికి అడ్డుకట్ట
హైదరాబాద్,నేటిధాత్రి:
భవనాల క్రమబద్ధీకరణ విషయంలో జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు భవన నిర్మాణరంగంలో మరింత పారదర్శకతను ప్రోత్సహించేదిగా మాత్రమే కాదు, అవినీతి, నిర్లక్ష్యం, బద్ధంకంతో కూడిన అధికార్లకు ముల్లుపోటు వంటిదనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. అవినీతి, లంచగొండితనాలకు బాగా అలవాటు పడిన కొందరు అధికార్లకు ఈ తీర్పు గొంతులో పచ్చివెలక్కాల పడిన చందం వంటిదే. ఎందుకంటే బిల్డర్లతో కుమ్మక్కయి నిబంధనలకు వ్యతిరేకంగా ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తూ ఇటు ప్రజలకు,పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే విధంగా, ఇదే సమయంలో భూమిపై పెరుగుతున్న ఒత్తి డిని గుర్తించకుండా లంచాలు మరిగి బిల్డర్లకు కొమ్ముకాస్తున్న అధికార్లు ఈ తీర్పుతో ఇక ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఎప్పుడైతే ఇటువంటి అధికార్లు దోవకు వస్తారో అప్పుడు బిల్డర్లు కూడా ఒళ్లు దగ్గరపెట్టుకొని తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించక తప్పదు. చాలా సందర్భాల్లో భూమిని చూపించి ప్రకటనలద్వారా అపార్ట్‌మెంట్లు, విల్లాల బుకింగ్‌లు చేపట్టిన కొన్ని కంపెనీలు, తగిన మొత్తంలో ప్రజలనుండి అడ్వాన్స్ మొత్తాలను సేకరించి తర్వాత బోర్డు తిప్పేయడం వంటి అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అటువంటి మోసగాళ్లనుంచి అమాయకులైన ప్రజలకు కొంతమేర రక్షణ కల్పిస్తుదని చెప్పవచ్చు. ఇదే సమయంలో కొత్త అపార్ట్‌మెంట్లు, విల్లాలు లేదా భవనాలు కొనుగోలు చేయాలనుకునేవారు గుడ్డిగా వేటినీ నమ్మకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మరీ తమ కష్టార్జితా న్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ తీర్పు మార్గదర్శనం చేస్తుంది. అంతేకాదు దిగువ కోర్టు లు వివిధ కారణాలను చూపుతూ బిల్లర్లపై ‘సానుభూతి’ చూపాల్సిన అవసరం లేదని కూడా ది గువ కోర్టులను కోరింది.
ఊరికే రాని డబ్బును, అయాచితంగా జరుగుతున్న మోసాలు అప్పనంగా కబళించి వేస్తుంటే, గుడ్డిగా నమ్మిన సామాన్యులు మోసపోవడం, దండిగా సంపాదించుకున్న మోసగాళ్లు బిచాణా ఎత్తేయడం చాలా సందర్భాల్లో చోటుచేసుకుంటున్నది. అటువంటివి జరగకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అధికార్లు మొద్దునిద్ర వదిలి, చురుగ్గా పనిచేసేలా చేస్తున్నది. ఇకముందు అధికార్లు అను మతులు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, భవన నిర్మాణ దశలపై రికార్డుల్లో నమోదు చేయాలి. తప్పుడు అనుమతులు ఇస్తే వీళ్లే జరిమానాలు చెల్లించాలి! పట్టణ ప్రణాళిక అనేది అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. పర్యావరణం, జనాభా, భూమిపై ఒత్తిడి, భూగర్భ జలాలు, వంటి వివిధ అంశాల ప్రాతిపదికన పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం వెల్లివిరిసేలా ప్రణాలిక రూపకల్పన జరుగుతుంది. అక్ర మంగా భూములను ఆక్రమించుకొని లేదా పట్టణ ప్రణాళికతో సంబంధంలేకుండా తమకు అనుకూలమైన రీతిలో భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతుండటం వల్లనే రాష్ట్రంలోని నగరా లు, పట్టణాలు ఒక పద్ధతి లేకుండా విస్తరిస్తున్నాయి. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు నిండా మునిగిపోవడం, నడి ఎండాకాలంలో నీటి ఎద్దడి వంటి సమస్యలు సర్వసాధారణమైపోయా యి. అదే పట్టణ ప్రణాళిక ప్రకారం, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇళ్లు, భారీ నిర్మాణాలు చేపడితే పై సమస్యలకు తావుండదు. ముఖ్యంగా విద్యుత్, భూగ ర్భజలాలు, రోడ్లపై ఒత్తిడి పెరగదు. కానీ అవినీతి తాండవమాడేది సరిగ్గా ఈ నిర్మాణ అనుమ తుల విషయంలోనే. బిల్డర్ల అత్యాస, అవినీతి అధికార్ల కక్కుర్తి వెరసి పట్టణాలు, నగరాలు ఇరు కుగా మారుతున్నాయి. అదీకాకుండా ఎవరైనా అక్రమ నిర్మాణమంటూ కోర్టుకెళితే, అన్ని రకాల అనుమతి పత్రాలను చూపి బిల్డర్లు యదేచ్ఛగా తప్పించుకుంటున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో అనుమతులు ఇచ్చే ముందు అధికార్లు వెనకా ముందూ ఆలోచిం చి అన్నీ సక్రమంగా వుంటేనే ముందుకెళ్లాలి. లేకపోతే వీరికి జరిమానా తప్పదు. నిర్మాణ సమయంలో భవనాన్ని నిర్ణీత కాలావధిలో తనిఖీలను ఈ తీర్పు తప్పనిసరి చేసింది. అధికార్లు ఏమా త్రం బద్ధకించినా లేదా నిర్లక్ష్యం వహించినా, జరిగే పొరపాట్లకు వారే బాధ్యత వహించక తప్పదు. కోర్టు ధిక్కరణను కూడా ఎదుర్కొనాల్సి వుంటుంది.
ఇక బిల్డర్ల విషయానికి వస్తే ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్ నిర్మాణ ప్రదేశంలో ప్రదర్శించడంతప్పనిసరి. దీనివల్ల అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ లేనిదీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు అనుమతించిన ప్లాన్ ఒకటైతే, నిర్మాణం మరో ప్లాన్‌లో చేపట్టడం అన వాయితీగా వస్తోంది. ఇందుకు కారణం లంచాలే! లంచం సమర్పిస్తే ఏ అధికారి తనిఖీలకు రా రు. బిల్డర్లదే ఇష్టారాజ్యం. కేవలం కాగితాలపై మాత్రమే ప్రణాళిక ప్రకారం నిర్మాణం వుంటుంది. ప్రదేశం మీద నిర్మించే దానికి, అనుమతించిన ప్లాన్‌కు అసలు పొంతనే వుండదు. ఇటువంటి అక్రమాలకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసేదిగా వుంది. అంతేకాదు బిల్డింగ్ ప్లాన్‌కు ఆమోదం పొందే సమయంలో బిల్డర్ ‘సంబంధిత అధికార్లనుంచి కంప్లీషన్/ఆక్యుపేషన్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వా తనే యజమానులకు బిల్డింగ్‌ను లేదా అపార్ట్‌మెంట్‌ను అప్పగిస్తానని ఒక హామీ పత్రం ఇవ్వడాన్ని’ ఈ తీర్పు తప్పనిసరి చేసింది. ముఖ్యంగా ఇది లబ్దిదారులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే అన్నిరకాల సదుపాయాలు కల్పించకుండా యజమానులకు బిల్డింగ్‌ను అప్పగించకుం డా ఈ హామీ పత్రం నియంత్రిస్తుంది. ఇదే సమయంలో బ్యాంకులు కూడా బిల్డర్ల మాయా జా లానికి మోసపోకుండా వుండేందుకు కూడా తీర్పులో కచ్చితమైన నిర్దేశాలుండటం విశేషం. కంప్లీషన్ సర్టిఫికెట్‌ను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బ్యాంకులు, బిల్డర్లకు రుణాలు మంజూరు చేయాల్సివుంటుంది. అంతేకాదు కంప్లీషన్/ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందితేనే నిర్మాణానికి విద్యుత్, మంచినీరు, మురుగునీటి కనెక్షన్ అందించాలని కూడా సంబంధిత అధికార్లకు కోర్టు నిర్దేశించింది. ఇన్ని లింక్‌లు వున్న నేపథ్యంలో అధికార్లు కంప్లీషన్ సర్టిఫికెట్ జారీచేసే సమయంలో కచ్చితంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో ఎదైనా సమస్య వస్తే ఇరుక్కునేది జారీచేసిన అధికారి మాత్రమే! ఎందుకంటే ఈ సర్టిఫికెట్‌పైనే ఆధారపడి మిగిలిన అన్ని సదుపాయాలు, రుణాల మంజూరు జరుగుతున్నాయి కనుక! వీటిల్లో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా అది కోర్టు ధి క్కరణకే వస్తుందని స్పష్టం చేయడం అవినీతికి ముకుతాడు వేసే చర్యనే! ఇదే సమయంలో ఒక బిల్డర్, కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదనో, అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధం చేయలేదనో లేదా మరే ఇతర కారణాలనో చూపుతూ ఫిర్యాదు చేసినప్పుడు, అధికార్లు దానిపై 90 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. అధికార్లు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే, అదికూడా ఏకకాల పరిష్కారంగా చేపట్టాలి. ఒకవేళ ఏదైనా భవనం నిర్ణీత ప్లాన్ ప్రకారం లేదని తేలినా, అక్రమంగా నిర్మిస్తున్నాడని నిర్ధారణ అయినా దాన్ని తక్షణం కూల్చి వేసే అధికారం అధికార్లకుంటుంది. అటువంటి నిర్మాణాల అంశం కోర్టుల దృష్టికి వస్తే వాటిని ఆపాలి. లేకపోతే కోర్టులు ‘అనవసర సానుభూతి’ చూపినట్లవుతుంది. ఈవిషయంలో కోర్టులు కచ్చితంగా వ్యవహరించాల్సి వుంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో నివాస భవనాలను వాణిజ్య భవనాలుగా మార్పిడి చేసిన కే సుపై సుప్రీంకోర్టు తాజాగా డిసెంబర్ 17న ఇచ్చిన ఈ తీర్పు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేదిగా వుంది. ఈ తీర్పు కాపీలను దేశంలోని అన్ని హైకోర్టులకు పంపడం వల్ల అక్రమ నిర్మాణాల విషయంలో ఆయా కోర్టులు ఈ నిర్దేశాలను కచ్చితంగా పాటించేందుకు వీలవుతుంది.