అటు ఒత్తిళ్లు..ఇటు బెదిరింపులు!

`ఉద్యోగాలు చేయలేకపోతున్నాం

`కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నాం

`పని చేయడం కష్టంగా వుంది

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆవేదన, ఆందోళన

`తప్పు చేస్తే సహించకండి

`మాతో తప్పులు చేయించకండి

`అక్రమాలు ఎప్పుడూ సక్రమం కావు

`ప్రజా ప్రతినిధుల టార్గెట్లు సరైంది కాదు

`ప్రభుత్వ ఆదేశాలు పాటించాలా!

`ఎమ్మెల్సేల హుకూం భరించాలా?

`అయోమయ స్థితిలో పని చేస్తున్నాం

`భయపెట్టి పనులు చేయిస్తే బాధ్యులమౌతున్నాం

`ప్రజల దృష్టిలో చులకనౌతున్నాం

`అవినీతి పరులుగా ఆరోపణలెదుర్కొంటున్నాం

`అందరూ బెదిరించే వాళ్లే తయారౌతున్నారు

`స్వేచ్ఛగా పనులు చేయలేకపోతున్నాం

`ఎమ్మెల్యేలు మా ఆదేశాలే పాటించాలంటున్నారు

`మేమే బాస్‌లమని బెదిరిస్తున్నారు

`మంత్రి మాకన్నా సీనియర్‌ కాదని కొందరు ఎమ్మెల్యేలంటున్నారు

`చెప్పిన పని చేస్తారా? లేదా! అని ఇబ్బంది పెడుతున్నారు

`చెప్పిన పని చేయకపోతే మీడియాలో లేనిపోనివి రాయిస్తున్నారు

`సబ్‌ రిజిస్ట్రార్లను అవినీతి పరులుగా ముద్రలు వేస్తున్నారు

`గత ప్రభుత్వ హయాంలో విన్నట్లే ఇప్పుడూ వినాలంటున్నారు

`ఎమ్మెల్యేలను దిక్కరిస్తే శంకరగిరి మాణ్యాలు పట్టిస్తామంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. సబ్‌ రిజిస్ట్రార్ల జీవితాలు ఇందుకు బాగా అద్దం పుడుతున్నాయి. ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్లే..ప్రతి ఒక్కరూ నిందలేసేవాళ్లే. ప్రతి ఒక్కరూ నిలదీసేవాళ్లే..ప్రతి ఒక్కరూ నీ సంగతి చూస్తా? అని భయపెట్టేవాళ్లే? అసలు ఏం జరుగుతుతందో అర్ధం కాని త్రిశంకు స్వర్గంలో సబ్‌ రిజిస్ట్రార్లున్నారు. ఇంకా కొందరైతే భయపెట్టి పని చేయించుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ల పని వాళ్లు ఎలా చేసుకోగలరు. ప్రజలు న్యాయం ఎలా చేయగలరు. మరో వైపు సమాజం నుంచి నిందలు, అపనిందలు, చీత్కారాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేశాఖలో కొలువులు. అయినా సరే అందరీ సమాదానం చెప్పాలి. లేకుంటే భయపడుతూ బతకాలి. నిత్యం అంటు ఒత్తిళ్లు, ఇటు బెదిరింపులతో కాలం గడపాలి. సామాన్యుల నుంచి వచ్చే ఇబ్బందేమీ లేదు. కాని నాయకుల మూలంగా ఇటీవల కాలంలో సబ్‌ రిజిస్ట్రార్లు పని చేయలేకపోతున్నారు. అందరూ నాయకులే. అందరూ రిజిస్ట్రార్ల మీద పెత్తనం చేసేవారే. మేం చెప్పినపని చేయాలని హుకూం జారీ చేసేవాళ్లే..ఇంత మంది బెదిరింపుల మధ్య పని ఎలా చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లు చెప్పే అక్రమ పనులు చేయలేమంటే ఒక తంటా? చేస్తే జనం నుంచి మరో తంటా? ఇలాంటి సందిగ్ధావస్తలో పని చేయలేకపోతున్నాం మహా ప్రభో అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాపై నాయకుల ఒత్తిళ్లు లేకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. ఎందుకంటే నాయకులను కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. పని చేయడం కష్టంగా వుందని భోరు మంటున్నారు. ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన. ఇటీవల సబ్‌ రిజిస్ట్రార్లంతా ముక్త కంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. మేం తప్పు చేస్తే సహించకండి. అది ప్రభుత్వమైనా, ఇంకెవరైనా? కాని తమతో తప్పుడు పనులు చేయించకండి? అని వేడుకుంటున్నారు. నాయకల ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనే కాకుండా, ఉద్యోగాలు పోతాయేమో? అని భయపడుతున్నారు. పనులు చేయించుకునే నాయకులు బాగానే వుంటారు. కాని కొలువులు పోతే తమ జీవితాలు వీదిన పడతాయని భయపడుతున్నారు. కనిపించిన ప్రతి భూమిని మా పరం చేయమని, మా పేరున రిజిస్ట్రేషన్‌ చేయమని ఒత్తిడిచేస్తున్ననాయకులు మరీ ఎక్కువౌతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఒత్తిడి చేసి బెదిరించి పనులు చేయించుకున్నా అది సక్రమం కాదు. దాని వల్ల వివాదాలపాలు సబ్‌ రిజిస్ట్రార్లే అవుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలౌతున్నారు. తప్పు చేసే వాళ్లే కాదు..చేయించిన వాళ్లు కూడా నేరానికి పాల్పడినట్లే. కాని వాళ్లు తెరమీదకు రారు. తప్పులు సబ్‌ రిజిస్ట్రార్ల మీద తోసేసి చేతులు దులుపుకుంటారు. పైగా నెల నెల మేం అడిగింది ఇవ్వాలి. మేం చెప్పినలెక్క ముట్ట జెప్పాలంటే ఎక్కడి నుంచి తేవాలి. వారికి కప్పం ఎలా కట్టాలి. గత పాలకులకు ఎలా సహకరించారో మాకు అలాగే సహకరించాలంటారు. గతంలో ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది. గతంలో ఏం చేయించుకున్నారో మాకు అవసరమేముంది? అక్రమ పనులు చేయించమని బెదిరిస్తే కొంత మంది సబ్‌ రిజిస్ట్రార్లు సెలవులపై వెళ్లిపోతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రజలకు మేలు చేయాలనిచూస్తోంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసేలా నూతన పద్దతులు తెచ్చిపెడుతోంది. మాకు చాలా వరకు సులభరతమైన పని రానుంది. ఒక రోజులో మరిన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు కానున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ఎక్కువ కాలం రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేకుండా సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగడానికి వీలుండదు. మధ్య వర్తులు అసలే వుండరు. ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. పైగా సబ్‌రిజిస్ట్రార్లు ఏ చిన్న తప్పు చేసినా ఉపేక్షించే పరిస్దితి వుండదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. ఎక్కడ పట్టిద్దామా? అన్నట్లు మీడియా డేగ కన్నులేసుకొని చూస్తోంది. ఇలాంటి సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు సబ్‌ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ ఎమ్మెల్యే నేను చెప్పింది వింటావా? లేదా? నేను చేయమన్న రిజిస్ట్రేషన్‌ చేస్తావా? లేదా? అంటూ భయపెడుతున్నాడట. ఈ నియోజకవర్గానికి నేనే బాస్‌. నేను చెప్పిందే నవ్వు వినాలని ఆర్డర్‌ వేస్తున్నాడట. మీరు చెప్పమన్నవన్నీ చేస్తే నా ఉద్యోగం పోతుందని సబ్‌ రిజిస్ట్రార్లు అంటుంటే, మీ ఉద్యోగాలకు నేనే భరోసా ఇస్తాను. నేను చెప్పిన పని చేయకుంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శంకరగిరి మాణ్యాలు పట్టిస్తానని బెదిరిస్తున్నారట. దాంతో సబ్‌ రిజిస్ట్రార్లకు ఏంచేయాలో అర్దం కాకుండాపోతోందిన వాపోతుందన్నారు. ప్రభుత్వమే ఎలాంటి తప్పులు జరగకూడదని నూతన ఆవిష్కరణలు తెచ్చి,సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే, అదే ప్రభుత్వంతో చెప్పి మీ అంతు చూస్తామంటూ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? కాపాడమని ఎవరిని వేడుకుంటారు? సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి ఓ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి. మంత్రి రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న తప్పును కూడా సహించేది లేదని ఇప్పటికే ప్రకటనలుచేస్తున్నారు. అలాంటి మంత్రి ఇన్‌చార్జిగా వున్న జిల్లాలో ఓ ఎమ్మెల్యే నేను మంత్రికన్నా సీనియర్‌ని. మంత్రి నాకు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి? నేనే నీకు బాస్‌..మంత్రి చెప్పినట్లు కాదు..నువ్వు కొలువులో వుండాలంటే నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పినట్లే చేయాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులమీద బెదిరింపులు సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పార్టీలో మేం సీనియర్లం. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిమంత్రి అయినంత మాత్రాన మాకన్నా తోపు కాదు..మాపై ఆయన పెత్తనం సాగనివ్వం. మా జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనానికి స్ధానం లేదు. ఆయనకు మా జిల్లాలో ఎలాంటి ప్రాదాన్యత లేదు. అర్దమౌతుందా? అని కొంత మంది సబ్‌ రిజిస్ట్రార్లను పిలిపించుకొని ఓ ఎమ్మెల్యే తన పటాటోపం చూపించనట్లు తెలుస్తోంది. దాంతో తాము ప్రజలకు సేవ చేయడానికి వున్నామో..నాయకులకు ఊడిగం చేయడానికి కొలువులు చేయాలో అర్దం కావడం లేదని సబ్‌ రిజిస్ట్రార్లు మధన పడుతున్నారు.. ఇటీవల ఆ ఎమ్మెల్యే సబ్‌ రిజిస్ట్రార్లను పిలిచి చెప్పిన పనులు చేయకపోవడంతో, ఆ రిజిస్ట్రార్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు రాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వార్తలు ఎందుకొస్తున్నాయని మిగతా మీడియా ప్రతినిదులు సబ్‌రిజిస్ల్రార్లను ప్రశ్నించారు. చూస్తున్నారు… ఎమ్మెల్యే వ్యక్తిగత కక్షతో ఇలాంటి వార్తలు రాయిస్తుంటే నేనెలా భాధ్యుడినౌతానంటూ ఆ సబ్‌రిజిస్ట్రార్‌ తన భాధను వెలుబుచ్చారు. అయినా తాము తప్పు చేస్తే శిక్షించేస్ధాయిలో వున్న ఎమ్మెల్యేలు మాపై తప్పుడు కథనాలు రాయిస్తే మేంఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మా గోడు విన్నవించుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్లు ఆవేదన చెందుతున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాకపై ఒక్క మచ్చ కూడా పడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో సీరియస్‌గా వ్యవస్ధను గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలకు సొంత భవనాలు వుండాలనుకుంటున్నాడు. తెలంగాణలో వున్న 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం తన హయాంలోనే జరగాలనికోరుకుంటున్నాడు. తాను మంత్రిగా వున్నంత కాలం రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అన్న పదం వినిపించకుండా వుండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే ప్రజలకు ఇప్పటి వరకు వున్నట్లు కాకుండా ఎంతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారి చేస్తున్నారు. ప్రజలకు కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నారు. పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగాలని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలు మా నెత్తి మీద తాండవం చేయాలని చూస్తున్నారు. ఈ ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు వదులుకొని వెళ్లాలనుకుంటున్నామని కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!