
Russia
విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి.. సరికొత్త స్కీమ్ తెచ్చిన ఆ దేశ సర్కార్..
ఓ దేశం తెచ్చిన స్కీమ్ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు గర్భవతులు అయితే దాదాపు రూ.లక్ష అందిస్తోంది. ఇది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేస్తుందని పలువురు మండిపడుతున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం జనాభా పెరిగితే చాలా అని భావిస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం.
గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉంది రష్యా. ఏళ్లు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఓ కొలక్కి రావడం లేదు. ఉన్న సైన్యం సరిపోక ఉక్రెయిన్ నుంచి సిబ్బందిని తెచ్చుకుంటుంది రష్యా. ఇప్పటివరకు యుద్ధంలో 2లక్షల 50వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది యువత దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో జనాభా సంక్షోభం తలెత్తింది. మరోవైపు జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న తరుణంలో దానిని పెంచేందుకు ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే సంతానోత్పత్తిని పెంచేందుకు రష్యా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భవతులు అయితే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మేధావులు విద్యార్థుల భవిష్యత్తును ఈ స్కీమ్ నాశనం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్రెమ్లిన్ మాత్రం జనాభా పెరుగుదలను జాతీయ బలం, వ్యూహాత్మక శక్తిగా భావిస్తుంది. అందుకే ఇటువంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 43శాతం మంది రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తుండగా.. 40శాతం మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ యువతుల భవిష్యత్తును దోపిడీ చేస్తుందని.. విద్య, కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందని పలువురు మండిపడుతున్నారు. అయితే ఈ విధానాలను రష్యా మాత్రమే కాదు వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు హంగేరీ పన్ను మినహాయింపులను అందిస్తుంది. పోలాండ్ ప్రతి బిడ్డకు నెలవారీ భత్యాలను చెల్లిస్తుంది. 2050 నాటికి మూడొంతుల కంటే ఎక్కువ దేశాల సంతానోత్పత్తి స్థాయిల దిగువకు పడపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.