చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్)పై కఠిన నిషేధం –వర్దన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరిక
వర్దన్నపేట (నేటిధాత్రి):
ప్రభుత్వం మరియు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం చైనా మంజా (నైలాన్ కైట్ స్ట్రింగ్) తయారీ, విక్రయం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడిందని వర్దన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ, చైనా మంజా అత్యంత పదునుగా ఉండటంతో రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సైకిల్ ప్రయాణికులు, పాదచారులు తీవ్ర గాయాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు గతంలో అనేక చోట్ల ఈ నైలాన్ మంజా కారణంగా గొంతు కోసుకుపోయిన ఘటనలు ప్రాణ నష్టం సంభవించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు అలాగే చైనా మంజా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ లైన్లకు చుట్టుకుపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని, కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు దీంతో ప్రజలకు ఆర్థిక నష్టం ప్రాణాపాయం కూడా ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చైనా మంజా వాడకుండా కట్టడి చేయాలని, పండుగలు సెలవుల సమయంలో పిల్లలు సురక్షితమైన కాగితపు మంజా మాత్రమే ఉపయోగించేలా చూడాలని సూచించారు. అలాగే వ్యాపారులు ఎవరైనా నిషేధిత మంజాను విక్రయిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సాయిబాబు కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని, నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు
