Police Warn Against IPL Betting
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
– ఎస్సై ఎం కాశినాథ్ యాదవ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మార్చ్ 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభం కావడంతో, క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ రూరల్ ఎస్సై ఎం కాశీనాథ్ యాదవ్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని సూచనలు చేశారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా కుటుంబాలు రోడ్డున పడతాయని, అప్పుల పాలై, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఎస్సై అన్నారు. బెట్టింగ్ రాయుళ్లపై, ముఖ్యంగా ఆన్లైన్ యాప్‌లు (టెలిగ్రామ్ , వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ ) ద్వారా నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.యువత, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా నిఘా ఉంచాలని,మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కాశీనాథ్ యాదవ్ తెలిపారు.
