
Airline Apology After Toilet Failure on 6-Hour Flight
విమానంలో ప్రయాణికులకు వింత అనుభవం.. సిబ్బందిపై ఫైర్
ఆరు గంటల సుదీర్ఘ ప్రయాణం. అలాంటి వేళ.. ప్రయాణికులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఆ విమానయాన సంస్థది. ఆ సంస్థ సిబ్బందిది. కానీ విమానం బయలుదేరు సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది.
జకార్తా, ఆగస్టు 31: విమానంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. దీంతో విమాన సిబ్బందిపై ప్రయాణికులు నిప్పులు చెరిగారు. ఇండోనేసియాలోని బాలి నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వెళ్తున్న విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమానం గురువారం మధ్యాహ్నం బాలిలోని డెన్పసర్ ఎయిర్ పోర్ట్ నుంచి బ్రిస్బేన్కు బయలుదేరింది. అనంతరం విమానంలోని పలు టాయిలెట్లలో సమస్య నెలకొందని విమాన సిబ్బంది గుర్తించారు.
మొత్తం ఆరు గంటల ప్రయాణంలో.. మొదటి మూడు గంటలు ఒక్క బాత్రూమ్నే వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు సిబ్బంది సూచించారు. ఆ తర్వాత సదరు బాత్ రూమ్లో సైతం సమస్య తలెత్తింది. దీంతో చేసేది లేక.. నీళ్ల బాటిళ్లలో మూత్ర విసర్జన చేయాలంటూ ప్రయాణికులకు విమాన సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విమాన సిబ్బందిపై ప్రయాణికులు నిప్పులు చెరిగారు.
బాత్ రూమ్ విషయంలో వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ సిబ్బంది తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక వృద్ధ మహిళ.. మూడు గంటల పాటు మూత్రాన్ని నిలుపుకోలే పోయింది. దీంతో తన సీట్లోనే ఆమె మూత్ర విసర్జన చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై వర్జిన్ ఆస్ట్రేలియా స్పందించింది. జరిగిన ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు తెలిపింది. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.