· దిగువ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
· వెంటాడుతున్న మనీలాండరింగ్ కేసు
· బీఆరఎస్ నాయకత్వంతో తీవ్ర విభేదాలు
· అన్నను, బంధువులను దూరం చేసుకుంటున్న కవిత
· ఒకపక్క న్యాయపోరాటం మరోపక్క కొత్త పార్టీ నిర్మాణం
· కేసీఆర్‌ను ధిక్కరించి వెళ్లిన నాయకులు ఎవరూ ఎదగలేదు
· కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఇంకా త్రిశంకు స్వర్గంలోనే
· కవిత నిర్ణయం ఎంతవరకు సమంజసమో కాలమే తేల్చాలి
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, సీబీఐ పేర్కొన్న 23 నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ స్పెషల్ రోజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేందర్‌సింగ్ ఫిబ్రవరి 27నతీర్పు చెప్పడం, ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేయడం వెంట వెంటనే జరిగిన పరిణామాలు. ఈ కేసులో “సౌత్ గ్రూప” అని సీబీఐ పేర్కొనడాన్ని న్యాయ మూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. అసలు సరైన ఆధారాలు లేకుండా కేసు పైల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఒక ప్రాంతానికి వర్తించేలా పేర్కొనడం సరైంది కాదని స్పష్టం చే స్తూ, ఈ కేసు విచారించిన సీబీఐ అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించడం తీర్పులోని కీలక పరిణామం. కాగా రోజ్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారిలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత కూడా వున్నారు. దిగువ కోర్టులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దీనికి సంబంధించిన మనీలాండ రింగ్ కే సు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న మనీలాండరింగ్ కేసుకు ఆధారంగా పనిచేసే సీబీఐ దాఖలు చేసిన “ప్రిడికేట్ అఫెన్స” కేసును ప్రత్యేక రోజ్ అవెన్యూ కోర్టు కొట్టేయడంతో ఈడీ విచారణ బలహీన పడే అవకాశముంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మనీలాండరింగ్ కేసు నిలబడా లంటే ముందు ఒక “షెడ్యూల్ నేరం” (ముందస్తు నేరం) జరిగివుండాలి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని భావించాలి. ఇదిలావుండగా తాజా తీర్పు కల్వకుంట్లకవితలో పూర్తి ఉత్సాహాన్ని నింపిందన్నది సుస్పష్టం. తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసులో కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని గతంలో చెప్పినట్టే జరిగిందని ఆమె తన అభిమానులకు ఆనందంగా చెప్పడం సహజమే. 2025 సెప్టెంబర్‌లో ఆమె బీఆరఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన తర్వాత, తాను వచ్చే మే నెలలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తాను తిరిగి బీఆరఎస్‌లో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాను న్యాయపోరాటం చేస్తున్న సమయంలో తన సోదరుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యు లు తనను ఒంటరిగా వదిలేశారని ఆరోపించారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని పేర్కొన్న కేటీఆర్ సోషల్ మీడియా పోస్ట్‌ను కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటమికి పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈవిధమైన ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్టీ నిర్లక్ష్య విధానాలు, అహంకారం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు తిరిగి పార్టీ టిక్కెట్లు ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణమని ఆమె ఎదురుదాడికి దిగారు. తాను జైల్లో వున్నప్పుడు కేసీఆర్ లేదా కేటీఆర్‌లు తనకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదని, బీఆరఎస్ సోషల్ మీడియా టీమ్ తనపై దుష్ప్రచారం చేసినప్పుడు వీరు కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. అందువల్లనే సొంత పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. అయితే ట్రైల్ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా ఇప్పుడు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయడంతో, ఈ కేసుకు సంబంధించి న్యాయపోరాటం ముగిసినట్టు కాదన్నది స్పష్టమైంది. రేపు హైకోర్టు తీర్పు ఎట్లా వస్తుందనే దానిపై కల్వకుంట్ల కవిత రాజకీయ భవి తవ్యం ఆధారపడివుంటుంది. ప్రస్తుతానికైతే తాను స్వచ్ఛంగా బయటకు వచ్చానని ప్రచారం చే సుకోవడానికి కవితకు వీలుకలిగింది.
ఇప్పుడు రాజకీయంగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి గతంలో తాను ఆరోపణలు చేసిన హరీష్‌రావు, సంతోష్‌రావులపై దాడులను కవిత మరింత ఉధతం చేయవచ్చు. కేసీఆర్‌కు తెలి యకుండా వీరు పెద్దఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆమె గతంలో ఆరోపించారు. అంతేకాదు హరీష్‌రావు, సంతోష్రావులిద్దరూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చేతులు కలిపి, తనను, తండ్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసారని కూడా ఆరోపించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ తెలిపిన శుభాకాంక్షలకు ఆమె పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.అం తేకాదు, వచ్చే మేనెలలో “సామాజిక తెలంగాణ”, “యువత సాధికారత” ప్రాధాన్యతగా కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించడం ద్వారా ఆమె బీఆరఎస్‌పై రాజకీయ యుద్ధాన్ని ప్రకటించినట్లయింది. ఒకవేళ హైకోర్టులో కూడా తీర్పు అనుకూలంగా వస్తే ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించి, “‘నైతిక విజయం” పేరుతో ఆమె ప్రజల్లోకి మరింతగా వెళ్లడానికే ప్రయత్నిస్తారు. అంతేకాదు బీఆరఎస్‌లోని అసంతప్తులు ఆమె పెట్టే కొత్తపార్టీవైపు మొగ్గుచూపే అవకాశముం టుంది. అంతేకాదు ఇక తన బంధువు హరీష్‌రావును నేరుగా ఢీకొనేందుకు సిద్దిపేట లేదా బోధన్ నుంచి వచ్చే ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయి. ఈ రెండు స్థానాలు హరీష్‌రావుకు పెట్టని కోట వంటివి! అంతేకాదు బీఆరఎస్ లీగల్ మెషినరీ సహాయం లేకుండా ఆమె హైకోర్టులో విజయం సాధిస్తే ఇక బీఆరఎస్‌కు, తన తండ్రి నాయకత్వానికి పూర్తిగా బ్రేకప్ చెప్పినట్టే అవు తుంది. కానీ ప్రస్తుతానికి ఈడీ కేసు కొనసాగుతుండటం, హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తాను పూర్తిగా కడిగిన ముత్యమని ప్రచారం చేసుకొనే వీలు కవితకు వుండదు. అంటే న్యాయపరమైన విచారణ నుంచి విముక్తి పొందినట్టు కాదు! ఒకవేళ హైకోర్టులో కవిత కు అనుకూలంగా తీర్పు వచ్చినా, సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలే ఎక్కువ! అందువల్ల కవిత రాజకీయ భవితవ్యం ఇంకా కొన్నేళ్లపాటు సందిగ్ధంలో కొనసాగక తప్పదు. ప్రస్తుతం కేసు హైకోర్టులో వున్నందువల్ల “ప్రిడికేట్ అఫెన్స” చట్టపరంగా మళ్లీ యాక్టివ్‌గా వున్నట్టే భావించాలి. ఇటువంటి పరిస్థితిలో కవిత కొత్త పార్టీని ప్రకటించినా, తటస్థ ఓటర్లను లేదా విశ్వసనీయ నాయకులను పార్టీకి అనుకూలంగా మలచుకోవడం కష్టం. తన ఆర్థిక వనరులను పూర్తిగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటాలకే వెచ్చించాల్సి రావచ్చు. ఇది క్షేత్రస్థాయిలో ఆమె పెట్టాలనుకుంటున్న “సామాజిక తెలంగాణపార్టీకి” అవరోధంగా మారగలదు.
ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేయడం న్యాయమైన చర్యగా బీఆరఎస్ (కేటీఆర్, హరీష్‌రావు) ప్రచారం చేయవచ్చు. ముఖ్యంగా ఈ అవినీతి కార ణంగానే ఆమెను పార్టీనుంచి సస్పెండ్ చేశామని వీరు సమర్థించుకోవడం మొదలుపెడతారు. ఇక కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయడం వల్ల, కవిత కోరుకుంటున్న రాజకీయంగా “క్లీన్ ఇమేజ” దెబ్బతినే ప్రమాదముంది. ఇక ఈ న్యాయప్రక్రియ పూర్తయ్యే సరికి సంవత్సరాలు గడిచిపోవడంవల్ల అప్పటివరకు “నిందితురాలు” అనే పేరును భారంగా మోయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ నేరం రుజువై శిక్ష పడితే పొలిటికల్ కెరీర్ దెబ్బతినవచ్చు. ప్రస్తుతానికి ఆమె “తెలంగాణ గొంతుకను నొక్కేయడానికే” కేంద్రం కుట్ర పన్నుతోంద న్న అంశాన్నే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు.
విచిత్రమేమంటే రెండు విభిన్న కేసుల్లో జైళ్లకు వెళ్లినప్పటికీ కవితకు, డీఎంకే నాయకురాలు కనిమెళి అనుభవాల్లో కొన్ని సారూప్యతలు కనిపించడం గమనార్హం. కవిత లిక్కర్ కేసుకు సంబం ధించి రూ.100 కోట్ల స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొనగా, కనిమొళి తమ కుటుంబానికి చెందిన కలైగ్నార్ టీవీకి సంబంధించి రూ.200 కోట్ల స్కాంలో అభియోగాలు ఎదుర్కొన్నారు. కవిత 5నెలల పాటు తిహార్ జైల్లో గడపగా, కనిమొలి ఆర్నెల్లు ఇదే జైల్లో వున్నారు. అంటే న్యాయపరం గా వీరు ఎదుర్కొన్న సమస్య ఒక్కటే అయినా, కనిమొళి డీఎంకేకు పూర్తి విధేయంగా వున్నారు. అదే కవిత బీఆరఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కనిమొళికి ఆమె సోదరుడు స్టాలిన్ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాతి కాలంలో ఆమెను లోక్‌సభకు పంపడం ద్వారా ప్రమోషన్ లభించింది. ఆవిధంగా ఆమెకు రాజకీయ సానుకూలత ఏర్పడింది. 2017 లో కనిమొళిని సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. కానీ కవిత పరిస్థితి పూర్తి భి న్నం. సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదు. పైగా తన అన్నపైనే తీవ్రవిమర్శలు చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావులపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అందువల్ల ఆమె రాజకీ యంగా ఒంటరి పోరాటం చేయకతప్పదు. ఇదే సమయంలో లీగల్ పోరాటం ఇంకా ముగియలేదు. అందువల్ల తాను “కడిగిన ముత్యం” అని పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోవడం న్యాయపోరాటం పూర్తయ్యే వరకు కొంచెం ఇబ్బందికరమే! అయితే తన పార్టీ నిర్మాణం విషయంలో ఇప్పటికే కవిత ప్రశాంత్ కిషోర్‌ను చాలాసార్లు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. పోయిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సంస్థ తెలంగాణ జాగతి దాదాపు 40 మున్సిపల్ వార్డు స్థానాల్లో మద్దతు పలుకగా, వారు విజయం సాధించడంతో, ప్రజల్లో తనకు అభిమానం పెరుగుతున్నదన్న ఉద్దేశంతో కవిత వున్నారు. కానీ గతంలో కేసీఆర్‌ను వ్యతిరేకించి బయటకు వెళ్లిన నా యకులు ఎవ్వరూ రాజకీయంగా నిýదొక్కుకున్న దాఖలాలు లేవు. పార్టీ మారిన ఈటెల రాజేందర్ పరిస్థితి బీజేపీలో ఎట్లా వున్నదో తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల భవిత వ్యం ఇప్పుడు త్రిశంకుస్వర్గంలో వుంది. కవిత సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నారు కనుక, కొత్త పార్టీ నిర్మాణం, కేడర్‌ను విస్తరించుకోవడం, ఆర్థికపరమైన మద్దతు వంటి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొనాల్సి వుంటుంది. ఇవన్నీ సమకూర్చుకున్నా, రాష్ట్రస్థాయి నాయకురాలిగా ఆమెకు ఇప్పటివరకు ఇమేజ్ లేదు. ఎక్కడికక్కడ బలమైన స్థానిక నాయకులను ఎదుర్కొని పార్టీని నిర్మించడం అంత తేలికైన పనికాదు. పధ్నాలుగున్నరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి, చివరకు చావు అంచువరకు వెళ్లిన కేసీఆరే రెండు టర్మ్‌లకు మించి అధికారంలో లేరు. తండ్రిచాటు బిడ్డగా వున్న కవిత ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి దానికి నారు, నీరు పోసి జాగ్రత్తగా అభివద్ధి చేయడంచెప్పుకున్నంత తేలిక కాదు. గొప్ప ఛరిష్మా కలిగిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు తాజాగా తమిళ నాడుకు చెందిన స్టార్ విజయ్లే తల్లక్రిందులవుతున్నారు. పోగైన జనాభాలో ఎంతమందిఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి! అక్కడిదాకా ఎందుకు కేటీఆర్, హరీష్‌రావులు బీఆరఎస్ కోసంఎంతగా కష్టపడుతున్నారో మనకు తెలిసిందే. ఈ విశ్లేషణ నేపథ్యంలో కవితది తొందరపాటు నిర్ణయమా లేక నిజమైన నాయకత్వ లక్షణాన్ని పుణికి తెచ్చుకున్న నిర్ణయమా అన్నది భవిష్యత్తే తే ల్చగలదు.
