ఆర్టిసి బస్టాండ్ లోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం

మందమర్రి, నేటిధాత్రి:-

ఏజెన్సీ ప్రాంతమైన పట్టణ మున్సిపాలిటీ లోని టిఎస్ఆర్టిసి బస్టాండ్ నిర్వహణ, బస్టాండ్ లోకి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను పట్టణానికి చెందిన ఎన్ఎస్యూఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి గంట రాకేష్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ, పట్టణం 80వేల జనాభా కలిగి, జిల్లా కేంద్రానికి 14కిలో మీటర్ల దూరంలో ఉండి, జాతీయ రహదారిని ఆనుకుని ఉందన్నారు. మున్సిపాలిటీ మార్కెట్ ప్రాంతంలో 2ఎకరాల సువిశాలమైన స్థలంలో 4 ఫ్లాట్ ఫాంలతో నిర్మించి ఉన్న బస్టాండ్ నిర్వహణ లేక, బస్సు ల రాక పోకలు లేక, దయ్యాల బంగ్లా ను తలపిస్తుందన్నారు. బస్టాండ్ లో కనీసం విద్యుత్ సౌకర్యం సైతం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని తెలిపారు. పట్టణ ప్రజలు ఎన్నో రోజులుగా బస్టాండ్ ప్రాంతానికి బస్సు లు వస్తాయని ఎదురు చూడడం తప్ప, బస్సులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో బస్టాండ్ సంబంధించిన విషయాలను ఆర్టీసీ ఎండి సజ్జనార్ కు ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగిందన్నారు. దానికి స్పందించిన ఆయన మంచిర్యాల డిపో మేనేజర్ ఏదుల మల్లేషయ్య కు ఆదేశాలు జారీ చేయడంతో డిపో మేనేజర్ మల్లేశయ్య అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత లు బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల, పట్టణ ప్రజలు సమావేశం నిర్వహించారు. అనంతరం తన పరిధిలో ఉన్న అన్ని విషయాలను త్వరగా పూర్తి చేస్తానని తెలిపి 2 సంవత్సరాలు గడిచినా ఎక్కడి పనులు అక్కడే బస్టాండ్ ప్రాంగణం ఉందని తెలిపారు. నాటి సదస్సులో పట్టణ ప్రజలు డిపో మేనేజర్ కు కొన్ని సూచనలు చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో దుకాణ సముదాయాలు నిర్మించి, అద్దెకు ఇస్తే ఆర్టీసీకి ఆదాయంతో పాటు బస్టాండ్ ప్రాంత అభివృద్ధి చెందుతుందని సూచించారు. కానీ నేటికీ ఆ విషయ ప్రస్తావన లేదని, అదేవిధంగా రోజు వారి బస్సులు సంఖ్య పెంచి, గోదావరిఖని నుండి బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుండి వచ్చే ప్రతి బస్సు వయా మందమర్రి నుండి వెళ్లే లాగా చర్యలు చేపడతామని చెప్పిన మంచిర్యాల డిపో మేనేజర్ మాటలు నేటికీ అమలులోకి రాలేదన్నారు. బస్టాండ్ నిర్మించి, పాతిక సంవత్సరాలు దాటిన నాటి బిల్డింగ్ నిర్మాణం తప్ప నేడు బస్టాండ్ ప్రాంతంలో కొత్తగా ఏమీ లేదని తెలిపారు. గతంలో పట్టణం పూర్తిగా సింగరేణి ఆధ్వర్యంలో ఉండేదని, నాడు సింగరేణి ప్రాంతంలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్న సింగరేణి సెక్యూరిటీ విభాగం అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, దానికోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ విభాగం ఉండేదన్నారు. కానీ ఎప్పుడైతే సింగరేణి మార్కెట్ ప్రాంతాన్ని ప్రభుత్వానికి అప్పగించిందో నాటినుండి మార్కెట్ ప్రాంతాల్లో కబ్జాలు కొనసాగుతున్నాయన్నారు. గతంలో బస్టాండ్ చుట్టూ దాదాపు 30ఫీట్ల తో రోడ్డు ఉండేదని, కానీ నేడు షాప్ ల పేరుతో బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కబ్జా అయ్యిందని, దీంతో మార్కెట్ కి పోయే పట్టణవాసులకు ఇక్కట్లు తప్పడం లేదని, కూరగాయల మార్కెట్ వెళ్లే దారి పూర్తిగా కబ్జా కావడంతో ఆ దారిలో రెండు ఆటోలు ఒకేసారి వెళ్ళని పరిస్థితి ఉందని, బస్టాండ్ చుట్టూ షాప్ ల పేరుతో కబ్జాకు గురైందని తెలిపారు. ఇప్పటికైనా మంత్రి, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని పట్టణ బస్టాండ్ కు అన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!