కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎరబాటి మాతాజీ
మొగుళ్లపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 14
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది..నిరంతరం మీకు అండగా ఉంటుంది..మహిళలకు అన్ని విధాలుగా సహకరిస్తుంది..ఆరోగ్యంగా జీవించండి..ఆనందంగా విహారించండని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరబాటి మాతాజీ అన్నారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఇందులో మొదటిది మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన పథకమని వివరించారు. అదేవిధంగా ప్రజలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.