
State Government Neglects Centre’s Matru Vandana Scheme
కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి
బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.