వేతన జీవులను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్
పలమనేరు(నేటి ధాత్రి)
సాధారణంగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురుచూసే వేతన జీవుల ఆశలను రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అడియాసలు చేశారు. 2025`26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో కొన్ని పథకాల అమలు కోసం కేటాయింపులు చేస్తామన్నారు తప్ప, జీతాల కోసం పనిచేస్తున్న కార్మికులకు బడ్జెట్‌లో చోటు ఇవ్వలేదు. ఎటువంటి జీఓ ఇవ్వకుండానే మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం చూస్తే గడ్డి చూపించి గుర్రాన్ని పరిగెత్తిం చడం వంటిదే. ఇతర వాగ్దానాలైన ఆశా వర్కర్ల జీతాల పెంపునకు ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు హామీ గురించి ప్రస్తావించలేదు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌బోర్డును పునరుద్ధరిస్తామన్న హామీకి అదే గతి పట్టించారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన విధంగా ప్రభుత్వం దొడ్డిదారిన వాడేసుకున్న బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ఈ బడ్జెట్‌లో జమ చేయలేదు. రాష్ట్రంలోని లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తమకు మినిమం టైంస్కేల్, ఉద్యోగాల పర్మినెంట్ అవుతాయని పెట్టుకున్న ఆశలపై తెలుగు దేశం కూటమి ప్రభుత్వం నీళ్లుజల్లింది.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్ ఊసేలేదు. వారికి చెల్లించాల్సిన రూ వేలాది కోట్లు బకాయిల ప్రస్తావన, కేటాయింపుల్లేవు. ఓపీఎస్ పునరుద్ధరణ గురించీలేదు. లక్షలాది మంది పనిచేస్తున్న సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌కు, రెండు లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌కు, మినిమం టైంస్కేల్ అమలు మధ్యాహ్నభోజన పథకం, వెలుగు కార్మికులకు కనీస వేతనాల అమలు, విద్యుత్, ఆర్టీసీ తదితర ప్రభుత్వరంగ సంస్థల కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్, టైం స్కేల్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి కనీసం ప్రస్తావన, కేటాయింపులు లేవు. తక్కువ జీతాలు తీసుకునే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాల హామీ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం శోచనీయం.
సామాన్యుల సంతోషమే రాజుల సంతోషమని బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం చెప్పుకుంది. కానీ షాపులు, మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, హోటల్స్ తదితర వాటిల్లో పనిచేస్తున్న దాదాపు 50 లక్షల మంది కార్మికుల వేతనాలు 2006,07 తర్వాత ఇంత వరకూ పెంచలేదు.
ఈ బడ్జెట్‌లో కూడా వాటి పెంపు ప్రస్తావనలేదు.
గత ప్రభుత్వ విచ్ఛిన్నం వలన అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిందని ప్రసంగంలో చెబుతూనే ఈ బడ్జెట్‌లో రూ. 80 వేల కోట్లు అప్పులను ప్రతిపాదించారు. వేతనాల కోసం, కూలి కోసం శ్రమ చేసి బతికేవారికెవ్వరికైనా సంక్షేమ పథకాలు మాత్రమే సంతృప్తి పర్చలేవని 2024 రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో తేలింది. ఈ ఫలితాల నుండైనా కూటమి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. కార్మికుల వేతనాల కోసం, సంక్షేమం కోసం తగిన విధంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన మార్పులు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, డు జై గిరిధర్ గుప్తాఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..