
మరో సినిమా చేయకుండా చేశారు.. హైకోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో
తమిళ ఆగ్ర నటుడు రవి మోహన్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
తమిళ ఆగ్ర నటుడు రవి మోహన్ (Ravi Mohan) మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్ణీత సమయంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేయనందుకు రూ.9 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలని హీరో రవి మోహన్ మద్రాస్ హైకోర్టు (Madras High Court ) లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. కోవైకి చెందిన బాబీ టచ్ గోల్డ్ యూనివర్స్ (Bobby Touch Gold Universal Private Limited) అనే నిర్మాణ సంస్థ తనతో రెండు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. అయితే.. ఆ అగ్రిమెంట్ మేరకు చిత్ర నిర్మాణాలు ప్రారంభించని కారణంగా తన 80 రోజుల డేట్స్ వృథా అయ్యాయని, నేను మరో సినిమా చిత్రీకరణలో పాల్గొనకుండా జరిగిందన్నారు. అంతేగాక అదే సమయంలో అనేక సినిమాలు చేజారాయని, దాంతో.. తనకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని రూ. కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ రవి మోహన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ న్యాయమూర్తి అబ్దుల్ ఖుద్దూస్ (Justice Abdul Quddhose) సమక్షంలో విచారణకు రాగా ఈ పిటిషన్ విచారణకు అనర్హమైనదని, తమ మధ్యఒప్పందాన్ని ఉల్లంఘించి హీరో రవి మోహన్ పరాశక్తి (Parasakthi) సినిమాలో నటించారని నిర్మాణ సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.