రామకృష్ణాపూర్, జనవరి 27, నేటిధాత్రి:
ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న అద్భుత సన్నివేశం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిర్యాల ప్రధాన రహదారి శ్రీనివాస గార్డెన్ లో శనివారం చోటు చేసుకుంది. 97-98 సంవత్సరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపూర్ లో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకొని ఆత్మీయ ఆలింగనంతో నాటి జ్ఞాపకాలను అప్పుడు గడిపిన మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారు 80 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు మొదలైన విషయాలపై తమ వివరాలను అనుభవాలను పంచుకున్నారు. తామంతా ఇక్కడికి రావడం అప్పుడు చదువుకున్న స్నేహితులతో కలిసి తమ అనుభవాలను అభిప్రాయాలను వెల్లడించడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే కలుసుకొని ఆనందాన్ని పంచుకోవాలని కష్ట సుఖాలలో ఒకరినొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలని అనుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తామంతా ఒకే గొడుగు కింద చదువుకున్న నాతోటి పూర్వ విద్యార్థులకు సమ్మేళనంలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పాఠశాలలో చదువుకున్న రోజులలో జ్ఞాపకాలను తెలిసి తెలియని వయసులో చేసే అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ ఎన్నటికీ మరిచిపోలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోసం ఆయా ప్రాంతాలలో జీవితాన్ని కొనసాగిస్తూ మనుషులు దూరమైన మమతలు కలిసి ఉంటాయని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు.