Student Awareness on Drug Prevention
సే నో టు డ్రగ్స్ నినాదంతో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా వేంపల్లి లో యువతను మాదకద్రవ్యాల ఉచ్చు నుంచి రక్షించేందుకు మంచిర్యాల జిల్లా యంత్రాంగం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు.ఇందులో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సే నో టు డ్రగ్స్ నినాదంతో ప్రత్యేక అవగాహన సదస్సులను బుధవారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల,వేంపల్లిలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాలల్లో గంజాయి,ఇతర డ్రగ్స్ వాడకం వల్ల కలిగే భయంకరమైన అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.అనిత,జిల్లా సంక్షేమ శాఖ అధికారి రావు ఖాన్,ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జగతి,ఎక్సైజ్ సీఐ గురువయ్య రావడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మిషన్ పరివర్తన లో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ముఖ్యంగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.మత్తు పదార్థాల వినియోగం కొద్దిసేపటి ఉత్సాహం ఇచ్చినా అది చివరికి బలహీనమైన జ్ఞాపకశక్తి,ప్రవర్తనలో మార్పులు,జీవితంపై విరక్తికి దారి తీస్తుందని తెలిపారు.గుండెపోటు,ఊపిరితిత్తుల దీర్ఘకాలిక వాపు, రక్తనాళాల ఇన్ఫెక్షన్లు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అధిక మోతాదు (ఓవర్డోస్) అయితే నేరుగా మరణానికి దారితీస్తుందని డాక్టర్ అనిత విద్యార్థులను హెచ్చరించారు.పౌరుల సహకారం అవసరం
మాదకద్రవ్యాల వాడకం వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుందని, కలహాలకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. మానసిక,శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరం ఉండాలని కోరారు.డ్రగ్స్ తీసుకొనే లేదా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి lవారి వివరాలను ధైర్యంగా అధికారులకు అందజేయాలని ఎక్సైజ్ సీఐ గురువయ్య పేర్కొన్నారు.
అనంతరం,విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్,వెంకటేశ్వర్లు (సిహెచ్ఓ),పద్మ (డిపిహెచ్ఎన్),బుక్క వెంకటేశ్వర్ (జిల్లా మాస్ మీడియా అధికారి)తో పాటు జి.గురువయ్య (సీఐ), బి.శంకర్ (పి & ఎస్ఐ) తదితర ఎక్సైజ్ సిబ్బంది, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
