డ్రగ్స్ తో దుష్పపరిమాణాలు అనేకం
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన సదస్సు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అంశంపై మెడికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా, ఎస్పి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమన్నారు. మాదక ద్రవ్యాలు దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాశనకారి అన్నారు. దీన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల్లాంటి వాటిని దగ్గరికి రానివ్వద్దని మెడికల్ విద్యార్థులకు సూచించారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా కష్టపడి చదివి ఉన్నత స్ధానంలో ఉండాలన్నారు. జిల్లాలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై పటిష్ట నిఘా పెట్టినట్లు ఎస్పి వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ చైర్ పర్సన్ గా ఏడుగురు సభ్యులతో కూడిన ‘యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేశామని, డ్రగ్స్ వినియోగం, రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజు దేవ్ డే, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, వైస్ ప్రిన్సిపల్ కే. రాజేశం, డాక్టర్ వందన, చిట్యాల సిఐ వేణు చందర్, ఘనపురం ఎస్ఐ సాంబమూర్తి, మెడికల్ కాలేజీ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.