కొల్చారం మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు జరుపటి రాజు….
కొల్చారం, ( మెదక్ ) నేటి ధాత్రి:-
వడ్డెరుల సమస్యలు తీర్చాలని కొల్చారం మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు జరుపటి రాజు, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎత్తిరి మారయ్యతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరుపటి జైపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారయ్య మాట్లాడుతూ కొల్చారంలో ఫారెస్ట్ అధికారులు వడ్డరులను రాళ్లు కొట్టకుండా అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా గ్రామంలోని వడ్డరులు స్థానిక తిరుమలయ్య గుట్ట ప్రాంతంలో తరాలుగా రాయి కొట్టి జీవనం సాగిస్తున్నారన్నారు. ఇటీవల నూతనంగా వచ్చిన బీట్ ఆఫీసర్ వారిని రాళ్లు కొట్టనీయడం లేదని, దీంతో వారి ఉపాధి దెబ్బతింటుందని, వారి కుటుంబాలు రోడ్డున పడతాయి అన్నారు. వడ్డరులకు రాళ్లు కొట్టడం తప్ప మరో పని రాదన్నారు. ఈ విషయమై తాము తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ ను కలువగా సానుకూలంగా స్పందించి, ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు లేఖ రాశారన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, కొల్చారం మండల అధ్యక్షుడు జరుపటి రాజు తదితరులు పాల్గొన్నారు.