Fog Turns Into a Roadside Menace
దారిపై మంచు భూతం..
గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
చలితీవ్రత పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేస్తోంది. కనీసం పదడుగుల దూరంలోని మనుషులు, వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు ఉంటోంది. ఉదయం 8 గంటలు దాటినా దీనిప్రభావం ఉంటోంది. ఈనేపథ్యంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు వంద కిలోమీటర్ల మేర ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి శిర జాతీయరహదారి, మడకశిర నుంచి కళ్యాణదుర్గం రహదారి, కదిరి జాతీయరహదారి విశాలంగా ఉన్నాయి. దీంతో వాహనాలు అతివేగంగా పరుగులు తీస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డుపై ఎక్కువ భాగం పొగమంచు కప్పివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతిఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో తెల్లవారుజామున, ఉదయం జరిగే రోడ్డు ప్రమాదాలు అధిక పొగమంచు కారణంగానే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
– గతవారం జాతీయరహదారిపై తెల్లవారుజామున బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు మంచు ప్రభావంతో మలుపు గుర్తించ లేకపోవడంతో నేరుగా వెళ్లి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారు గాయపడ్డారు.
– కొద్దిరోజుల క్రితం కదిరి, అనంతపురం హైవేపై కదిరి సమీపంలో పొగమంచు ప్రభావంతో రోడ్డు దాటుతున్న మహిళ కనిపించక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
