కంపు కొడుతున్న మురుగు కాలువలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
దుర్గంధంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులు ఝరాసంగం మండల కేంద్రంలోని 8వ వార్డులో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ కాలువలో చెత్తాచెదారం నిండిపోవడంతో మురుగునీరు ప్రవహించే మార్గం లేక కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పుడు ఎలాంటి రోగాలు బారిన పడవలసివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో నివసించే ప్రజల ఇళ్ళ ముందు కాలువలో మురుగునీరు నిల్వఉంటున్నా అధికా రులు పట్టించుకోవడం లేదు. ఈ మురుగు కాలువ పక్కన ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఈ మురుగు నీరు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండడంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారు లు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు, విద్యార్థులు కోరుతున్నారు.