హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజల కొరకు సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు హైస్కూల్ నిర్మించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించుకోవడానికి చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి పెగడపల్లి, గంగిపల్లి ,ఎలుకంటి, ప్రజల జీవనాధారమైన 2400 ఎకరాల పైచిలుకు భూమిని సింగరేణి సంస్థ సేకరించారు. కానీ గ్రామ ప్రజలు పవర్ ప్లాంట్ నుంచి వెలుపడే కాలుష్యం వలన వివిధ రకాలైనటువంటి జబ్బులు వస్తున్నప్పటికీ ప్రజల కోసము మెరుగైన వైద్యం కోసము 5 ఎకరాల స్థలము సేకరించి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించకపోవడం సిగ్గుచేటుగా ఉందని,గత ప్రభుత్వం లో ఉన్నటువంటి సింగరేణి సీ అండ్ ఎం డి శ్రీధర్ నిర్లక్ష్యం వలనే నిర్వాసితులకు ఎటువంటి సదుపాయాలు అందలేదని, ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి సీ అండ్ ఎండి బలరాం నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, మరియు చుట్టు ప్రక్కన ఉన్నటువంటి గ్రామ ప్రజలకు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ రకాల జబ్బులకు అనుభవజ్ఞులైన డాక్టర్లను ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో వైద్య చికిత్స దించేలా చూడాలని, అదేవిధంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజల పిల్లల భవిష్యత్తు కొరకు సింగరేణి ఆధ్వర్యంలో హైస్కూల్ ను నిర్మించాలని హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు.