
Singareni’s Safety First
భారతదేశ సంస్థగా సింగరేణి…
సింగరేణి వివిధ దేశాలలో విస్తరిస్తాం…
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే ప్రధాన లక్ష్యం…
గనుల్లో భద్రత పెంపుకు పటిష్ట చర్యలు…
సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్…
ప్రమాద రహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలి…
డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సంస్థలో పనిచేసే కార్మికులే సింగరేణికి కొండంత బలమని, కార్మిక సంఘాలు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ అన్నారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డీజీఎం ఎస్ ఉజ్వల్ థా, సౌత్ జోన్ డీజీఎం కన్నన్ లతో కలిసి ముఖ్య అతిథులుగా సీఎండీ ఎన్ బలరాం నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థను భారతదేశంలో విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నామని, సోలార్ రంగంలో అడుగు పెట్టడం జరిగిందని, ఒడిశా రాజస్థాన్లో ఇప్పటికే విస్తరించగా రానున్న రోజుల్లో కర్ణాటకలో బంగారం, రాగి గనుల తవ్వకం పనుల్లో నిమగ్నం అవుతుందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్న సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే సంస్థ మునగడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడుతుందని, సంస్థ మనుగడను కాపాడుకోవాలంటే బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనాల్సిందేనని అన్నారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంస్థ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తి కన్నా సంస్థను కాపాడే కార్మికుల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేకుండా ఉన్న సమయాలలోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రమాద రహిత సంస్థగా సింగరేణినీ తీర్చిదిద్దరమే కాకుండా, ఆరోగ్యకరంగా కూడా మార్చాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి పై, ఉద్యోగి పై ఉందని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే సింగరేణిలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయని, రక్షణపై సింగరేణి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. సింగరేణి సంస్థలోకి మహిళా ఉద్యోగులు రావడం శుభ సూచకమని పేర్కొన్నారు. కార్మికులకు దసరా, దీపావళి పండుగల బోనస్ లు సకాలంలో అందేలా చూస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన భద్రత పక్షోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆయా డిపార్ట్మెంట్ లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకన్న, పోట్రూ, గౌతమ్, సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జిఎం ఎం శ్రీనివాస్, సిఎంఓఏఐ లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షులు జనప్రసాద్, వివిధ ఏరియాల జిఎంలు, అధికారులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.