Collector Warns Tahsildars on Pending Land Cases
సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారంలో ప్రగతి రాకుంటే చార్జెస్ ఫ్రేమ్ చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను హెచ్చరించారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలో భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారంపై అన్ని మండలాల తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వరకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేయని తహసిల్దారులకు చార్జెస్ ప్రేమ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో ప్రగతి కనబడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని, అవసరమైతే చార్జీలు ఫ్రేమ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను శనివారం నాటికి పూర్తిచేయాలని, రేయింబవళ్లు పనిచేసి పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
దరఖాస్తులు పరిష్కారంపై ప్రభుత్వం చాలా ఫోకస్ చేస్తున్నదని, ప్రతి వారం సిసిఎల్ఏ సమీక్ష నిర్వహిస్తున్నారని జాప్యం చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సమావేశంలో పూర్తి చేస్తామని చెపుతున్నారు కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయని కారణాలు చెప్పొద్దని అన్నారు.
దరఖాస్తు తిరస్కరించిన సందర్భంగా కారణాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
