Road Safety Awareness Program for Auto Drivers at Odela
ఆటో డ్రైవర్ల కు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై దీకొండ రమేష్..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని తగ్గించడంలో వాహనదారుల పాత్ర కీలకమన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, ఓవర్లోడింగ్ చేయరాదని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పారు.అలాగే వేగ నియంత్రణ, సిగ్నల్ నియమాల పాటింపు వంటి అంశాలపై విపులంగా వివరించారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ సంఘ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు.
