పేదలకు విదేశీ విద్య వెలగపండే..నా?

https://epaper.netidhatri.com/

`5 లక్షలిస్తేనే సంతకం పడేనా?

`మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా?

`తన టేబుల్‌ మీద వున్న ఫైలుపై సంతకం చేస్తారా?

`మంత్రికి తెలిసి జరుగుతోందా!

`తెలియకుండానే ఫైల్‌ రెడీ అయ్యిందా?

`బిసి.వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ బాగోతం!

`గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహరం.

`ప్రభుత్వం మారడంతో 5 ఐదులక్షలకు పెంచిన బేరం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

పేదల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే వుంటాం. పేదల కోసం కేటాయించిన నిధులు కొన్ని సార్లు గద్దల పాలు కావడం కూడా వింటూనే వుంటాం..ఇక్కడా అదే జరుగుతోందని సమాచారం. అది బిసి. వెల్ఫేర్‌ డిపార్టుమెంటు ఓవర్సీస్‌ సెక్షన్‌లో( మహాత్మ జ్యోతిరావ్‌ పూలే విదేశీ విద్యా నిధి) పనిచేసే ఓ ముగ్గురు ఉద్యోగుల చేతి వాటం మూలంగా నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరికీ కూడా విషయాలు తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సెక్షన్‌లో డిడిగా ఉదయ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ నికేష్‌, పిఏ. ఔట్‌సోర్సింగ్‌ వెంకటేష్‌లు ముగ్గురు కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నారని తెలిసింది. గత కొన్నేళ్లుగా వీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పెద్దఎత్తున విమర్శలున్నాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం రావడంతో గతంలో వసూలు చేసేదానికన్నా, ఎక్కువ మొత్తంలో విద్యార్ధుల తల్లిదండ్రులనుంచి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ ఏం జరుగుతోంది: మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యా నిధి అనే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొన్ని నిధులు కేటాయిస్తూ వుంటుంది. ప్రతి ఏడు తెలంగాణ నుంచి కనీసం 300 మందికి తక్కువ కాకుండా విదేశీ చదువు కోసం వెళ్లే విద్యార్ధులకు ఆర్దిక సాయం అందిస్తుంది. ఇదే కొందరు అక్రమార్కులకు ఆదాయ మార్గంగా మారింది. విద్యార్ధి దశలో ఎంతో కష్టపడి చదువుకునే పేద విద్యార్ధులకు ఆర్ధిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారి వారి ఉన్నత చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా గొప్ప స్ధాయిలో వుండాల్సిన ఎంతో మంది భవిష్యత్తు ఎక్కడో ఒక దగ్గర ముందుకు సాగకుండా ఆగిపోతోంది. వారి విజ్ఞానం సమాధి చేయబడుతోంది. సమాజానికి వారి మేధస్సు దూరమౌతోంది. నెరవేరని కలగా వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. కుటుంబాల ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా వుండడం ఒక్కటే శాపమౌతుంది. కాని ఆ విద్యార్ధుల్లో ఎంతో ప్రతిభ దాగివుంటుంది. తమకు కొంత డబ్బు వుంటే అందరిలాగా విదేశీ విద్య అందేదన్న బాధ మనసును తొలుస్తూ వుంటుంది. ఇంతే మన ఖర్మ అని ఎక్కడో అక్కడ చదువు ఆపేసుకోవాల్సివస్తుంది. అలాంటి విద్యార్ధుల చదువు మధ్యలోనే ఆగిపోవద్దని వారి విజ్ఞానం వృధా కావొద్దని వారి, ఆశలు ఆడియాసలు కావొద్దని గతంలో ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. పేదలకు కూడా పూర్తిగా ఉన్నత విద్యను ఉచితంగా అందుబాటులో వుంది. రాష్ట్రం వరకు ఎంత చదువుకున్నా అంత మేర ఉచితంగా విద్యను ఫీజు రీఎంబర్స్‌ మెంటు పేరుతో ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొందరు ఎంతో చురుకైన విద్యార్థులు మరింత ఉన్నతమైన జీవితం కోసం కలలు కంటుంటారు. రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. విజయాలు సాదిస్తుంటారు. అయినా విదేశీ విద్య అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అది ధనవంతులకు పెద్ద ఇబ్బంది కాదు. కాని పేదలకు అదే పెద్ద కష్టం. దాంతో ఆశలు చంపుకునేవారు ఎంతో మంది వున్నారు. మన జీవితాలు ఇంతేలే అని అడ్జస్ట్‌ అయ్యే వాళ్లున్నారు. కొంత మంది కుంగిపోయేవాళ్లుంటారు. అలా ఎంతో ప్రతిభ వున్నవారి చదువు ఎక్కడా ఆగిపోకుండా ఈ విద్యా నిధి దోహదపడుతుంది. పేదలలో ఎంతో మంది విజ్ఞాన వంతులున్నారు. ఎంతో మేదాశక్తి వున్నవారున్నారు. వారికి కొద్దిగా ఆర్ధిక తోడ్పాటునందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అధ్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాంటి వారి జీవితాశయాలు మొగ్గదశలోనే వాడిపోకూడదు. స్వార్ధ పరుల మూలంగా వారి భవిష్యత్తు నాశనం కావొద్దు. అయితే తెలంగాణలో ఏటా కొన్ని వేల మంది వెళ్లాలనుకుంటారు. కాని ప్రభుత్వం అంత మందిని ప్రోత్సహించలేదు. కేవలం ఏటా 300 మందిని మాత్రమే పంపేందుకు అవకాశం కల్పించింది. ఇదే అక్రమార్కులకు రాచమార్గమైంది.
ఎవరు అర్హులు: ఈ విద్యానిధిపై ఇంకా చాలా మందిలో అవగాహన లేదు. ఈ సదుపాయం అందాలంటే విద్యార్ధులు 35 ఏళ్ల వయసు మించకూడదు. ఇంజనీరింగ్‌, అగ్రికర్చర్‌ సైన్స్‌, మెడిసిన్‌, ఇలా కొన్ని ప్రత్యేక విభాగాలైన విద్యను విదేశాలలో చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. ఉన్నత విద్యలో 60శాతానికి పైగా మెరిట్‌ వున్నవారికి ఈ సదుపాయం కల్పించబడుతుంది. అయితే ఆ విద్యకు సంబందించిన కొన్ని పరీక్షలు కూడా వారు ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ సాధించాలి. ఐ 20 ఆహ్వానాలు వుండాలి. అందుకు వీసాలు వచ్చిన వారిని ఈ నిధి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఇది అన్ని దేశాలలో ఉన్నత విద్యకోసం కాదు. కేవలం కొన్ని దేశాలకే పరిమితం. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్‌ కొరియా, జపాన్‌, రష్యా, కెనడా, జర్మనీ, యూకే. సింగపూర్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు మాత్రమే వర్తింపజేస్తారు. గతంలో ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షలు ఇచ్చేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం రూ.20 లక్షలు అందజేస్తూ వస్తోంది. ఈ అవకాశాన్ని పేద విద్యార్దులు ఉపయోగించుకోవాలి.
అవినీతి జలగలు: ఇలా బిసి విద్యార్థులకు వరమైన ఈ నిధినుంచి స్కాలర్‌షిప్‌ పొందేందుకు అర్హత సాధించాలంటే ప్రతిభ ఒక్కటే వుంటే సరిపోదన్నట్లు, ఆ నిధులు ఇవ్వాలంటే రెండు లక్షలు లంచం ఇస్తే తప్ప రూ.20 లక్షలు ఇవ్వడం లేదు. ఇలా విద్యార్ధుల ఉజ్వలమైన భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వస్తున్నారు. ఈ మాత్రం ఇచ్చుకోలేక ఎంతో మంది అర్హులైన విద్యార్ధులు చదువులను వదిలేసుకున్నవారు వున్నారు. కొంత మంది ధనవంతులు కూడా ఇలాంటి స్కీమ్‌లను వినియోగించుకునేందుకు సెక్షన్‌లోని ఉద్యోగులు అడిగినంత ఇచ్చి, రూ.20 లక్షలు తీసుకున్నవారు కూడా వున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు తెలియకుండానే ఉదయ్‌, నికేష్‌, వెంకటేష్‌ అనే ఉద్యోగులు పైల్‌ తయారు చేస్తుంటారన్న విషయం బైటకు వచ్చింది.
తాజాగా 5లక్షలు: గతంలో రెండు లక్షలు వసూలు చేసే ఈ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చిందని, పై వారికి ముట్టజెప్పాలని చెప్పి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అలా తీసుకున్న సొమ్ముతో తయారుచేసిన ఫైలు బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టేబుల్‌ మీదకు పంపించారని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ కు ఈ విషయం వెళ్లిందా? ఒక్కొక్కరి దగ్గర అంతంత వసూలు చేసి, కొత్త ప్రభుత్వాన్ని, మంత్రిని అబాసు పాలు చేసే అవకాశం వున్నాయి. అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. గత ప్రభుత్వంలో రెండు లక్షలు వసూలు చేశారన్న అపవాదు వుంది. అందుకే అధికారం కోల్పోయారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అవినీతి అధికారుల కొమ్ముకాస్తుందన్న అపవాదు ఎదుర్కొవాల్సివస్తుంది. అందువల్ల అసలు అడ్మినిస్ట్రేవివ్‌ ఆఫీసర్‌ సంతకం లేకుండానే ఫైలు ఎలా మంత్రి వద్దకు చేరిందో తెలియాల్సిన అవసరం వుంది. ఇంత కాలం పేదల సొమ్ము అప్పనంగా తిన్న ఈ ముగ్గురు ఉద్యోగులను విధులనుంచి తొలగించి వారు తిన్నది కక్కించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *