ఏసీబీ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 24 గంటలపాటు విచారణ కొనసాగింది. ఆర్డీఓ , నిమ్జ్ కార్యాలయం ఓకే భవనంలో ఉండడంతో సోదాలు కొనసాగినంత వరకు రెండు కార్యాలయాల సిబ్బంది 24 గంటల పాటు ఇళ్లకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఏసీబీ అధికారుల దాడుల సందర్భంగా జహీరాబాద్ వచ్చిన డీఆర్ఓ తో పాటు ఆర్డీఓ ఇతర అధికారులు, సిబ్బంది రాత్రంతా కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది.
చెక్కులు సీజ్..?
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ )ప్రాజెక్టు ఏర్పాటు కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిర్వాసితులకు ఇచ్చే డబ్బులు చెక్కుల రూపంలో ఆర్టీజీఎస్ చేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన చెక్కులు ఏసీబీ అధికారుల కంటపడడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన చెక్కులు ఎందుకు పంపిణీకి నోచుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అవినీతి అధికారులు డిమాండ్ చేసిన మొత్తం లంచం సొమ్ము నిర్వాసితుల నుంచి రానందుకే వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
