
"GHMC Notice to Allu Business Park"
అల్లు అర్జున్ కి “షాక్”
అల్లు బిజినెస్ పార్క్‌పై జీహెచ్ఎంసీ కన్నెర్ర
నిబంధనలకు విరుద్ధంగా పెంట్‌హౌస్ నిర్మాణం
ఎందుకు కూల్చి వేయకూడదంటూ నోటీసులు
“నేటిధాత్రి”, హైదరాబాద్:
పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా అదనపు నిర్మాణం చేపట్టారంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అల్లు అరవింద్‌కి ఈ నోటీసు షాక్ ఇవ్వగా, సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఎందుకు కూల్చకూడదు?
అల్లు అరవింద్ కుటుంబ వ్యాపారాలకు కేంద్రంగా నిలిచే ఈ బిజినెస్ పార్క్‌ను నవంబర్ 2023న అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ప్రారంభించారు. ఈ భవనానికి నాలుగు అంతస్తుల వరకు మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయి. అయితే ఈ అనుమతులను దాటి అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. భవనాన్ని పరిశీలించి అనుమతులు లేని పెంట్‌హౌస్‌ను గుర్తించారు. తక్షణమే నోటీసులు జారీ చేసి దానిని ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని అల్లు అరవింద్‌ను ఆదేశించారు.
నియమాలను ఉల్లంఘిస్తే ఎవరైనా సరే…
నిబంధనలను ఉల్లంఘించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలోని నిర్మాణాల విషయంలో వారు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి హై-ప్రొఫైల్ ప్రాంతంలో జరిగిన ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నోటీసుకు అల్లు అరవింద్ నుంచి సరైన వివరణ రాకపోతే పెంట్‌హౌస్‌ను కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు తెలిపాయి.
సినీ పరిశ్రమలో హాట్ టాపిక్
అల్లు అరవింద్ లాంటి ప్రముఖ నిర్మాతకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయడం సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ పార్క్‌లో నిబంధనల ఉల్లంఘన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అరవింద్ ఈ నోటీసుపై ఎలా స్పందిస్తారు, జీహెచ్ఎంసీ చర్యలను ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అల్లు కుటుంబం ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి