
Devotees Flock to Ketaki Sangameshwara Temple on Shani Amavasya
భక్తిశ్రద్ధలతో కేతకిలో శని అమావాస్య పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ కేతకే సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి,స్వామివారిని దర్శించుకున్నారు. శని అమావాస్య కావడం, మంజీర నది తీరంలో ఉన్న ఈ దేవస్థానం ప్రాముఖ్యత కారణంగా తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. శని అమావాస్య సందర్భంగా,ముఖ్యంగా శనివారము అమావాస్య ఉండడం వల్ల భక్తులు ఇక్కడ తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
ఈ ఆలయం మంజీర నది తీరంలో వెలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామివారిని బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడని నమ్ముతారు.కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి అమావాస్య రోజున, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర వంటి ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప ఆలయ సిబ్బంది అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన వితరణ చేశారు.